న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా దిగ్గజ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించనట్లుగానే రవిశాస్త్రి వారసుడిగా ద్రవిడ్‌ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సులక్షణ నాయక్, ఆర్పీ సింగ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ) ద్రవిడ్‌ను ఏకగీవ్రంగా నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వాస్తవానికి చీఫ్ కోచ్ రేసులో ఆలస్యంగా దూసుకొచ్చిన ద్రవిడ్.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభ్యర్థన మేరకు చీఫ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు మొగ్గుచూపినట్లు తెలిసింది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ టోర్నీతో ముగుస్తున్న నేపథ్యంలో చీఫ్ కోచ్‌తో పాటు సహాయక బృందం ఎంపిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్‌గా ఎందరినో యువ క్రికెటర్లను జాతీయ జట్టుకు అందించిన దిగ్గజ ద్రవిడ్ అయితే సరిగ్గా సరిపోతాడని బోర్డు భావించింది. ప్రధాన కోచ్ పదవి కోసం పోటీ అనేదే లేకుండా రాహుల్‌ను ఏకగీవ్రంగా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశం వేదికగా 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు ద్రవిడ్ దర్శకత్వంలో టీమ్ఇండియా ముందుకు నడవనుంది. ఈనెల 17 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత చీఫ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు అందుకోనున్నాడు. ఇదిలా ఉంటే సహాయక బృందంలో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై బోర్డు దృష్టి సారించింది. రవిశాస్త్రితో పాటు భరత్ అరుణ్, శ్రీధర్, విక్రమ్ రాథోడ్ పదవీకాలం ముగిసినందువల్ల వీరి స్థానాల్లో కొత్తవారిని తీసుకోనున్నారు. బౌలింగ్ కోచ్ రేసులో పారస్ మాంబ్రె ముందువరుసలో ఉండగా, ఫీల్డింగ్ కోచ్ పదవికి అభయ్ శర్మ, అజయ్ రాత్రా..దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌తో పోటీపడుతున్నారు.
టీమ్ఇండియా చీఫ్ కోచ్ బాధ్యతలు అందుకునేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నాను. రవిశాస్త్రి శిక్షణలో భారత్ అద్భుత విజయాలు సాధించింది. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగిస్తామన్న నమ్మకం నాకుంది. ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది క్రికెటర్లు..ఎన్సీఏ, అండర్-19, భారత్-ఎ తరఫున ఆడినప్పుడు కలిసి పనిచేసిన అనుభవం ఉంది. రానున్న రెండేండ్లలో ప్రపంచకప్ టోర్నీలు ఉన్నాయి. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామన్న నమ్మకముంది.
–రాహుల్ ద్రవిడ్