సినిమా అప్డేట్లు దర్శక, నిర్మాతలు ఇవ్వడం పరిపాటి. కానీ ఈ మధ్య కథానాయికలు తొందరపడిపోతున్నారు. దర్శక, నిర్మాతల కంటే ముందుగానే తమ సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. కథానాయిక రాశీఖన్నా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తాజా ఫొటో ఇప్పుడు అలాంటి దుమారమే రేపింది. పవన్‌కల్యాణ్ స్వయంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లొకేషన్లో తీసిన సెల్ఫీ ఇది. ఇందులో ఆయన చెంతనే రాశీఖన్నా నవ్వులు చిందిస్తూ ఉన్నారు.
వెనుక నిర్మాతలు చిత్ర బృందం కనిపిస్తున్నారు. ఈ ఫొటోతో పాటు ‘ఈ క్షణాలను లైఫ్ టైమ్ మెమొరీగా గుర్తుంచుకుంటా’ అంటూ ఓ కామెంట్‌ను కూడా జత చేసింది రాశీఖన్నా. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ను పవన్ ఓ వారంలో ముగించేయనున్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. రాశీ షేర్ చేసిన ఫొటో ఇప్పుడు ఆ వార్తలకు బలాన్నిచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ను పవన్ పూర్తిచేసేశారంటూ ఈ ఫొటో ఆధారంగా వార్తలు రాసేస్తున్నారు.