కెరీర్ ఆరంభంలో తాను బాడీషేమింగ్ (శారీరక రూపాన్ని చూసి హేళన చేయడం) విమర్శల్ని ఎదుర్కొన్నానని చెప్పింది అగ్ర కథానాయిక రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపించడంతో కొందరు చాటుగా గ్యాస్ టాంకర్ అంటూ కామెంట్స్ చేసేవారని వాపోయింది. ఖచ్చితమైన బరువు, శరీరాకృతిని మెయిన్‌టెయిన్ చేయడంలో చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొంది. అయితే విమర్శలకు ఎప్పుడూ భయపడలేదని..సానుకూల ఆలోచనలతో కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నానని చెప్పింది. దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ సుందరి ఇటీవల బాలీవుడ్లో అజయ్‌దేవ్‌గణ్ సరసన ‘రుద్ర’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ తొలినాటి రోజుల్ని గుర్తుచేసుకుంది. ‘కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఎక్కువ సినిమాలు చేశాను. మంచి అవకాశాలొచ్చాయి. అయితే లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేయడం బాధించేది. హార్మోన్స్ సమతుల్యత దెబ్బతినటం వల్ల బరువు ఆధీనంలో ఉండేది కాదు. ఆ విషయం గురించి తెలుసుకోకుండా ఏవో మాటలనేవారు. అన్నింటికంటే కెరీర్ ముఖ్యం కాబట్టి విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. సినిమా విజయాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నాలోని ఆధ్యాత్మిక భావాలు కూడా నా లోపాల్ని అధిగమించడానికి దోహదం చేశాయి’ అని చెప్పింది రాశీఖన్నా.