టికెట్ రేట్ల పెంపు, పెయిడ్ ప్రీమియర్షోలకు అనుమతి విషయంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనపై సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని అన్నారు ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి. టికెట్ రేట్ల పెంపు వల్ల సగటు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ వేదికల్లో సినిమాలు చూస్తున్నారని, దీనివల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలోని తాజా పరిస్థితులపై ఆర్.నారాయణమూర్తి స్పందించారు.
‘ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచబోనని, ప్రత్యేకషోలకు అనుమతి ఇవ్వనని సీఎం చెప్పినప్పుడు మేమంతా సంతోషపడ్డాం. ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని భావించాం. కానీ కొద్దిరోజుల్లోనే సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారు. ఇది ధర్మం కాదు. భారతదేశంలో సామాన్యుడి వినోద సాధనం సినిమా. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే టికెట్ రేట్లను నియంత్రణలో ఉంచాలి. ఈ విషయంలో సీఎం పునరాలోచన చేయాలి. దయచేసి ఇకముందు టికెట్ రేట్లు పెంచొద్దని తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నా’ అని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు.