Bowler Ashwin : ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ అభ్యర్థన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్టు పెట్టారు. అయితే గత బుధవారం బ్రిస్బేన్ టెస్టు ముగిసిన అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అశ్విన్ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయను కోరారు. ‘అశ్విన్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయను కోరాను. భారత క్రికెట్‌కు అశ్విన్ అందించిన సేవలకు అమూల్యమైనవి. ఆయన ఖేల్ రత్న అవార్డుకు అర్హుడు’ అని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు.
అశ్విన్ తన కెరీర్లో 106 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 537 వికెట్లు తీశాడు. అందులో 37 సార్లు ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లోనూ తనవంతు పాత్ర పోషించాడు. మొత్తం 3,503 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఏడో బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు దక్కించుకున్నాడు. అదేవిధంగా భారత్ బౌలర్లలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత రెండో బౌలర్‌గా నిలిచాడు.