మదీనా వీధుల్లో ఆ రోజుల్లో, మద్యం ఉదయం పొగమంచులా కమ్ముకుని ఉండేది. జూదంలో డబ్బు కొల్లగొట్టిన వారిండ్లల్లో ఆనందం వెల్లివిరిసేది. అదే జూదంలో సర్వం కోల్పోయిన వారి ఇండ్లల్లో కన్నీళ్లు ఏరులైపారేవి. కొందరు మనుషులు ఆనందం కోసం, మరికొందరు తమ బాధలను మర్చిపోవడం కోసం మత్తును ఆశ్రయించేవారు. అది ఒక కఠినమైన వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశం నుంచి జవాబు వచ్చింది. అది ఒక పిడుగులా పడలేదు, తల్లిదండ్రుల హితవులా వినిపించింది. ‘మద్యపానం గురించీ, జూదం గురించీ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఇలా ఉపదేశించు: ‘ఈ రెంటిలోనూ కీడు ఉన్నది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా, లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ” (అల్-బఖరా 2:219)
ఈ మాటలు మదీనా వీధుల్లో నిశ్శబ్దం సృష్టించాయి. ఆజ్ఞ పూర్తిగా లేదు! కానీ, ప్రేమతో కూడిన హెచ్చరికలా అనిపించింది. ‘కొంత ప్రయోజనం’ ఉన్నా, ‘పాపం అధికం’ అన్నారుగా అని అందరూ అనుకున్నారు. తాగేవారు ఆగిపోలేదు. కానీ, వారి అంతరంగంలో ఒక ఆలోచన మొదలైంది: ‘నా మంచితనం కంటే నా చెడు పెరిగిపోతోందా?’ అని ఎవరికి వారు తర్కించుకోవడం మొదలైంది. కొంత కాలానికి, మరొక దైవిక మాట వచ్చింది. అది వారి నరనరాల్లో ప్రవహించే నిత్య జీవితపు ప్రార్థనకు ముడిపడింది.
‘విశ్వాసులారా! మీరు నిషాస్థితిలో ఉన్నప్పుడు నమాజ్ దరిదాపులకు వెళ్లకండి. మీరు పలికేదేమిటో మీకు తెలిసినప్పుడే నమాజ్ చెయ్యాలి’ (అన్-నిసా 4:43) అని. ఐదు పూటలా ప్రార్థన. ఈ ఆజ్ఞ మద్యం తాగే సమయాన్ని ఒక్కసారిగా కుదించింది. దైవ సన్నిధిలో నిలబడే ముందు, తమ మాటల్లో స్పష్టత ఉండాలని అల్లాహ్ కోరాడు. అంటే, మద్యం ఒక ‘సామాజిక దురలవాటు’ స్థాయి నుంచి ‘దైవంతో అనుబంధాన్ని తెంచే అడ్డంకి’ స్థాయికి మారింది. ఇది మనసులకు ఇచ్చిన ఒక బలమైన శిక్షణ. ఇక ప్రజలు రాత్రి పూట తాగి, ఉదయపు ప్రార్థన (ఫజ్)కు ముందు దాని ప్రభావం పోవాలని నిరీక్షించడం మొదలుపెట్టారు. వారి మనసులు శుద్ధి అవుతున్న కొద్దీ, వారి హృదయాలు అంతిమ నిజాన్ని వినడానికి సిద్ధమయ్యాయి. చివరికి, అంతిమ ఆజ్ఞ రానే వచ్చింది. అది ఉగ్రతతో కూడినది కాదు, ప్రేమతో కూడిన రక్షణ కవచం.
‘విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన షైతాను పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. షైతాను సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలనీ, మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుంచి, నమాజు నుంచి వారించాలని కోరుతాడు. కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా?’ (అల్-మాయిదా 5:90-91) ‘కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా?’- ఈ ప్రశ్న, ఆజ్ఞ కాదు, మనస్సాక్షిని అడిగిన ప్రశ్న.
ఆ రోజు మదీనా వీధుల్లో, నిషేధిత ద్రాక్షారసపు కుండలు పగిలిపోయాయి. ఆ ద్రవం వీధుల్లో వరదలా ప్రవహించింది. ఈ దైవ సందేశంలోని గొప్పతనం ఏమంటే, అది కేవలం ‘తాగవద్దు’ అని చెప్పలేదు. అది మనిషిని అల్లాహ్ జ్ఞాపకం (జిక్) నుంచి, ప్రార్థన నుంచి దూరం చేసే శత్రుత్వానికి కారణమని వివరించింది. అల్లాహ్ ఆజ్ఞ, క్రమక్రమంగా, ప్రేమతో, వివేకంతో, మనిషి అంతరంగంలోకి చొచ్చుకుపోయింది. మద్యానికి బానిసైన హృదయాలు, దైవ ప్రేమకు బానిసలయ్యాయి. ఆ వీధుల్లోని దుర్వాసన పోయి, శాంతి, ప్రేమ సుగంధం వెదజల్లింది. ఈవిధంగా నిషేధం ఒక భారం కాకుండా, ఒక ఆధ్యాత్మిక విముక్తిగా మారింది. అల్లాహ్ మనుషులను రక్షించడానికి ఆజ్ఞాపించాడే తప్ప, శిక్షించడానికి కాదు.
-మహమ్మద్ ముజాహిద్, 96406 22076