ఎటువంటి వారైనా రాత్రి నిద్రించే సమయానికల్లా ఆత్మ పరిశిలన చేసుకోవాలి. తాను చేసే పనుల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా అని సమీక్షించుకోవాలి. దానికి పాపభీతి, దైవభీతి తోడైతే? ఆ ఫలాల గురించి ఇక వేరే చర్చించుకోనవసరం లేదు. దావీదు చూస్తే ఓ మహా సామ్రాజ్యానికి అధినేత. అంతటి వాడు దైవభీతితో ప్రతి రోజూ దేవుని ముందు మోకరిల్లి ప్రభువుతో మాట్లాడే వాడు. ఆ సంభాషణలో ఒక ఆత్మ పరిశీలన ఉండేది. తాను చేయ వలసిన తక్షణ కర్తవ్యమూ బోధ పడేది. దేవునితో ఏం మాట్లాడే వాడో, ఒకసారి పరిశీలించ గలిగితే, దీని అంతస్సారం పట్టుకోవచ్చు. రాత్రి సమయాల్లో కూడా ఆ మహారాజు ఆత్మావిష్కరణ ఇలా ఉండేది.
‘దేవా! నీ వాక్యం నన్ను బతికించింది. నా బాధలో కూడా అదే నాకు నెమ్మది కలిగించింది. రాత్రివేళ నీ నామ స్మరణం చేస్తూ నీ ధర్మశాస్త్రం ప్రకారమే ప్రవర్తిస్తూ ఉన్నా. నీ ఉపదేశాన్ని బట్టే నడుస్తున్నా. ఇదే నాకు పెద్ద వరం. తెలియకుండానే నాకు నీవు చేసే ఈ ఉపకారాల్ని బట్టి ఈ అర్ధరాత్రి వేళ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను మేల్కొని నీ సాయం నెమరవేస్తూ ఉన్నాను. అంతు లేని బంగారు, వెండి నాణేల కన్నా… నీవిచ్చిన ధర్మశాస్త్రం ఎంతో హితకరమైంది. నాకు రక్షణ కలిగించు, నీ కట్టడులే నాకు నిత్యం లక్ష్యం! నీ న్యాయవిధులు పాటించడానికే భయపడుతున్నా! నీ కృప చొప్పున ఈ నీ సేవకునికి మేలుచేయుము!!’ అని ప్రార్థించేవాడు.
ఒక రాజు తల వంచుకొని ఇలా దీనంగా ఆత్మ దర్శనం చేసుకో గలిగినప్పుడు ఆ సామ్రాజ్యం మొత్తం ఆయన్ను అనుసరించ గలిగితే, కలిగే సత్ఫలాలు లెక్కించగలమా? ఓ పాలకునికి ఈ పాటి దైవభీతి ఎప్పుడైతే ఉంటుందో, అతని పాలన నీతిమంతంగా ఉంటుంది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024