చిన్తయన్ చేతసా కృష్ణం ముక్తో భవతి సంసృతేః
(గోపాలతాపిన్య ఉపనిషత్) ‘కృష్ణుని చింతించే వాఁడు సంసారబంధం నుంచి విముక్తుడు అవుతాడ’ని పై ఉపనిషత్ వాక్యానికి భావం. కుచేలుడు దారి పొడవునా కృష్ణుడి గురించి చింతించినందుకు సంసారం బంధంగా పరిణమించిన దురవస్థ దూరమైంది. చాలినంత డబ్బు లేనప్పుడే సంసారం బంధంగా మారుతుంది కదా! కుచేలుడు గర్భ దరిద్రుడు. సంసారం నడవటం సాధ్యం కాలేదు. భార్య ‘అపరిచితులనైనా ఆదుకునే కృష్ణ భగవానుడు మీరు అడిగితే లేదంటాడా! నిశ్చల భక్తితో సేవిస్తారే! ఎంతో కొంత సంపద అనుగ్రహించడా! ఆయన వద్దకు వెళ్లిరమ్మ’ని కోరింది. సరే మంచిదని ‘ఏదో ఒక కానుక తీసుకుపోవాలి. చిన్ననాటి స్నేహితుడు కదా!’ అన్నాడు.
‘కృష్ణుని హోదాకు తగ్గవి ఇంట్లో ఏమీ లేవు’ అంటూనే ఆమె కొన్ని అటుకులు చిరుగుల ఉత్తరీయం కొసకు ముడివేసింది. ఉత్సాహంతో కుచేలుడు ద్వారక చేరుకున్నాడు. వైభవంగా సమస్త ఐశ్వర్యాలతో తులతూగే శ్రీకృష్ణుణ్ని దర్శించుకున్నాడు. చిరిగిపోయిన దుస్తులతో, ఎముకల గూడు లాంటి శరీరంతో ఉన్న కుచేలుడిని చూసి కృష్ణుడు హంసతూలికా తల్పం పై నుంచి గబుక్కున దిగి ఎదురు వచ్చి ఎంతో ప్రేమతో కౌగిలించుకొని లోనికి తీసుకెళ్లాడు. చిన్ననాటి ముచ్చట్లు రాత్రి పొద్దుపోయే వరకు చెప్పుకొని వారిద్దరూ మురిసిపోయారు. ‘నాకోసం ఏం తెచ్చావు?’ అంటూ కృష్ణుడు ప్రేమతో అడిగాడు. కుచేలుడు అటుకులు ఇవ్వడానికి జంకితే గమనించి తానే అతని ఉత్తరీయపు కొస ముడి విప్పాడు.
కుచేలుడు కండ్లప్పగించి చూశాడు. ‘దళమైనా పుష్పమైనా భక్తితో సమర్పిస్తే చాలు’ అంటూ కృష్ణుడు పిడికెడు అటుకులు ఆరగించాడు. మరో పిడికెడు తీసుకోబోతుంటే రుక్మిణి అడ్డుకున్నది. ‘ఇచ్చిన సంపదలు చాలు’ అన్నది. కుచేలుడు విశ్రమించి వేకువనే బయలుదేరి తన ఇంటికి వెళ్లాడు. ‘నేనడిగింది లేదు. కృష్ణుడు ఇచ్చిందీ లేదు’ అనుకున్నాడు. ఊరు చేరుకున్నాడు. కుచేలుడు పూరి పాక ఉన్న చోట పెద్ద భవనం ఉంది. దాసదాసీ జనంతో కోలాహలంగా ఉంది అక్కడి వాతావరణం. ఆ భవనంలో నుంచి కుచేలుడి భార్య బయటికి వచ్చి.. ‘ఇది మన ఇల్లే’ అంటూ భర్తను లోనికి తీసుకెళ్లింది. ‘సంస్కారవంతుడి సంపద సంసార బంధ విముక్తికి కారణమ’ని అప్పుడు అతనికి అర్థమైంది.
-డా॥ వెలుదండ సత్యనారాయణ