తిరుమల : డిసెంబర్ నెలకు ( Quota for December ) సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను టీటీడీ (TTD ) వెల్లడించింది. తిరుమల( Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఈ టికెట్లు పొందిన వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని సంబంధిత అధికారులు వివరించారు. 22న ఆర్జిత సేవైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు చేస్తామన్నారు.
23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు , ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటాను విడుదల చేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు .