తాండూర్ : ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య (Quality education) అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం తాండూర్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, విద్యాధికారి ఎస్ మల్లేశంతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, త్రాగునీరు, వంటశాల, భోజనశాల, వసతి గృహంలో వసతులు, పడకలు, మూత్రశాలలు, గదులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం పాఠశాల భవనంపై నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.