Qatar : పశ్చిమాసియా (West Asia) ఉద్రిక్తతల నేపథ్యంలో కొంతకాలం చమురు ఎగుమతులను తగ్గించిన ఖతార్ (Qatar) మళ్లీ జోరు పెంచనుంది. అమెరికా-ఇరాన్ (US-Iran) ఒప్పందం కుదరడంతో హర్మూజ్ (Hormuz) తిరిగి తెరుచుకోగానే ప్రపంచదేశాలకు చమురు ఎగుమతులను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా నాలుగు ఖాళీ ఎల్ఎన్జీ ట్యాంకర్లు (LNG ships), మరో అద్దె ట్యాంకర్‌ను ప్రసిద్ధ రస్ లఫాన్ చమురు క్షేత్రానికి తరలిస్తోంది. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఖతార్ (Quatar) కు చెందిన మరో నాలుగు ట్యాంకర్లు ఇప్పటికే ఒమన్ వద్ద నిలిచిఉన్నాయి. హర్మూజ్ ద్వారా పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించడానికి అవి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఖతార్ ఒక్క ఖాళీ నౌకను కూడా గల్ఫ్‌లోకి తిరిగి తీసుకురాలేదు. దాంతో రెండు నెలల్లోగా తన ఎగుమతి సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది. ఖతార్‌లోని రస్ లఫాన్ చమురు క్షేత్రం ప్రపంచంలోనే గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టుగా ఉంది. దాదాపు 20 ఏళ్లలో ఈ ప్రదేశం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పరిశ్రమకు హబ్‌గా ఎదిగింది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో విశాలమైన తీర ప్రాంతం ఉండటంతో ఇది ఆసియా, ఐరోపా ఎగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా పేరొందింది.
ఇక్కడి నుంచి భారత్ జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా సమాఖ్య, చైనా వంటి 30కి పైగా దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతోంది. యుద్ధం సమయంలో ఈ చమురు క్షేత్రం పైనా ఇరాన్ దాడులు చేయడంతో ఖతార్ కొంతకాలం చమురు ఎగుమతులను నిలిపివేసింది.