టోక్యో : జపాన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 21-11తో వాంగ్ లింగ్ చింగ్ (మలేషియా)ను వరుస గేమ్స్‌లో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో- ధృవ్ కపిల జంట 21-16, 21-14తో అలగ్జాండర్ డున్, జూలీ మెక్ఫర్సన్ (స్కాట్లాండ్)ను ఓడించి ముందంజ వేసింది.
కానీ, స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ.. మరోసారి గాయం కారణంగా తొలి రౌండ్ గేమ్ మధ్యలోనే తప్పుకుంది. డెన్మార్క్ జోడీ డేనియల్ లుంగార్డ్-మాడ్స్ వెస్టర్గార్డ్తో పోరులో 19-21తో తొలి గేమ్ కోల్పోయిన తర్వాత సాత్విక్ భుజం నొప్పి తిరగబెట్టడంతో భారత జోడీ మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఈ టోర్నీతో పాటు వచ్చే వారం మొదలుకానున్న చైనా ఓపెన్‌కూ సాత్విక్-చిరాగ్ దూరమవనున్నారు.