‘పుష్ప’ సినిమా ద్వారా నటుడిగా నాకు మంచి పేరుతో పాటు ఎలాంటి గుర్తింపు వచ్చినా ఆ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కే దక్కుతుంది. వెంకటేశ్వర స్వామి మీ అందరి వెనక ఎలా ఉన్నాడో అలాగే సుకుమార్ ఈ సినిమా ప్రయాణంలో నా వెన్నంటి నిలిచాడు. ఆయనలోని ఫైర్‌ను చాటిచెప్పిన చిత్రమిది’ అని అన్నారు అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం ఏపీలోని తిరుపతిలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘రెండేళ్లు కష్టపడి చేసిన సినిమాఇది. పుష్పరాజ్ పాత్ర కోసం చిత్తూరు ప్రజల జీవనవిధానం, వారి యాస, భాషల్ని నేర్చుకున్నా. తెలుగుతో పాటు అన్ని భాషల వారిని సినిమా మెప్పిస్తున్నది’ అని తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ ‘మా మూడో అన్నయ్య విజయ్ ఇచ్చిన ఐడియాతో రాసిన కథ ఇది. సినిమా కోసం నాతో పాటు టీమ్ మొత్తం రాత్రింబవళ్లు కష్టపడుతూ నాలో స్ఫూర్తిని నింపారు. వీరిలో ఒక్కరు లేకపోయినా సినిమా చేయాలనే కల సాధ్యమయ్యేదికాదు’ అని అన్నారు.
“పుష్ప’ పాత్రలో అల్లు అర్జున్ అద్వితీయ అభినయాన్ని కనబరిచారు. ఈ ఏడాది ఆయనకు జాతీయ అవార్డుతో మిగిలిన పురస్కారాలు రాకపోతే బాధపడేవారిలో నేనూ ఒకరినవుతా’ అని రష్మిక మందన్న పేర్కొన్నది. దాక్షాయణి విశ్వరూపాన్ని రెండో భాగంలో పూర్తిగా చూస్తారని అనసూయ భరద్వాజ్ చెప్పింది. విలన్‌గా తనను అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్, రవిశంకర్‌తో పాటు ముత్తంశెట్టి బ్రదర్స్ పాల్గొన్నారు.