‘నల్లంచు తెల్లచీర.. అది కూడా అందమైన టస్సర్ వస్త్రంతో.. సిద్దిపేట గొల్లభామ ప్రింట్లతో, రాజస్థానీ అజ్రక్ అద్దకం జాకెట్‌ను జోడించి కట్టుకోవాలి’ చల్లని సాయంత్రం జరిగే స్నేహితురాలి పెండ్లి కోసం ఓ ఆడపిల్ల మనసులో మెదులుతున్న కోరిక. ఇలా కోరిన వస్త్రశ్రేణిని అందించడమే కాదు, ఎంబ్రాయిడరీ, కుట్టు, ఇస్త్రీ దాకా ఆడవాళ్లకు సంబంధించి ఏ అవసరం ఉన్నా ఇంటి దగ్గరికే వచ్చి తాము చేసిపెడతామంటున్నది ‘పుంటో టీఎంపో’ సంస్థ. దేశం లోని అన్ని రకాలచేనేతలూ, హస్తకళల్ని వస్ర్తాలకు జోడిస్తున్న ఈ వినూత్న ప్రయోగం వెనుక డా॥ శ్రీదేవి శేషభట్టర్ కృషి ఎంతో ఉంది. ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రయాణం ఆంత్రప్రెన్యూర్‌షిప్ వైపు సాగడంలో ఆసక్తికర మలుపులెన్నో ఉన్నాయి. సీతారామం, కల్కి, హనుమాన్ తదితర సినిమాలకూ సేవలు అందించిన గెలుపులూ ఉన్నాయి. అవన్నీ ఆమె మాటల్లోనే..
చీరలతో మహిళలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మనసులో ఇలాంటి చీర కట్టుకోవాలి అని ఊహించుకున్నాం అనుకోండి. రంగు, ప్రింట్, వర్క్ అన్నీ… అలా అనుకున్నట్టు తయారయ్యి… చక్కటి మడతతో అరచేతిలోకి వచ్చి చేరితే… ఎంత బాగుంటుంది. నాకైతే అలా మగ్గం మీద నుంచి తీసిన చీరను చేతిలో పట్టుకున్నప్పుడు, అప్పుడే పుట్టిన అందమైన ఆడబిడ్డను అరచేతుల్లోకి తీసుకున్న అనుభూతి కలుగుతుంది. ఎంతో కష్టపడి ఓ వస్ర్తాన్ని డిజైన్ చేసినప్పుడు దాన్ని కావాలనుకున్న వాళ్లు మెరిసే కళ్లతో చూసినప్పుడు ఆ అనుభూతిని వర్ణించలేం. సెలెబ్రిటీల తరహాలో సాధారణ మహిళలకు కూడా వాళ్లకు నచ్చిన వస్త్రంతో, నచ్చిన ప్రింట్‌తో చీరలు చేసిస్తుంది ‘పుంటో’. నాకు ఇలా దుస్తులతో అనుబంధం అన్నది చాలా చిన్నప్పటి నుంచే ఏర్పడింది. మా నాయనమ్మ చక్కటి చేనేతల్ని కట్టుకునే వారు.
వాళ్లు నేతలో కౌంట్ లెక్కన మాట్లాడుకునేవారు. అంటే ఇది వంద కౌంట్ వెంకటగిరి, రెండు వందల కౌంట్ కాటన్ అలా అన్నమాట. రంగుల్నేమో… నెమలి కంఠం రంగు, చిలకాకుపచ్చ, ముక్కుపొడుం రంగు…అంటూ చక్కటి పేర్లతో పిలిచేవారు. వాళ్లతో కలిసి పెరగడం వల్ల అవన్నీ నాకు తెలిశాయి. ఆమె చీరల సెలెక్షన్ ఒక రకంగా ఉంటే, అమ్మది మరో రకం. అమ్మ ఉద్యోగస్తురాలు. కాబట్టి మెత్తగా ఉండి, చటుక్కున ఆరిపోయి, ఇస్త్రీలూ అవీ పెద్దగా అవసరం లేకుండానే అందంగా కనిపించే చీరలు కట్టుకునేది. ఎలా అంటే మాకో ఐస్పుల్ల ఇచ్చి డాబా మీద చీర ఆరేసి అక్కడ కూర్చోబెట్టేది. మేం తినేలోపు ఆ చీర ఆరిపోయేది. మడతపెట్టి తెచ్చేవాళ్లం. రంగులు, నాణ్యత, అవసరాన్ని బట్టి వస్ర్తాల ఎంపికలాంటివన్నీ చిన్ననాడే తెలిసొచ్చాయి.
అమ్మానాన్నా ప్రభుత్వ ఉద్యోగస్తులు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఇంటర్ పూర్తయ్యాక ఉస్మానియా యూనివర్సిటీలో టెక్స్టైల్ ఇంజినీరింగ్ చదివా. ఆ తర్వాత అమెరికా నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్‌లో ఎంఎస్, పీహెచ్డీ చేశా. మన దగ్గర పాఠాలు చెప్పేందుకు వాడే పుస్తకాలను రాసిన వాళ్లు అక్కడ నాకు ప్రొఫెసర్లుగా వచ్చేవారు. అప్పుడు ఎంతో ఉద్విగ్నతకు గురయ్యేదాన్ని. వాళ్లకు ఆ సబ్జెక్టుల మీద విపరీతమైన పట్టు ఉండేది. అంతే ప్యాషన్‌గా పాఠాలూ చెప్పేవాళ్లు. దాంతో నాకు వస్ర్తాల తయారీ, వాటి మెషినరీ, టెక్నాలజీ అన్నిటి మీదా బాగా పట్టు వచ్చింది. ఆరేళ్లు అమెరికాలో ఉండి, ఇండియాకు వచ్చా. ఇక్కడ పండరీపురంలో స్వెరి కళాశాల స్థాపించిన బబ్రువాహన రోంగే నన్ను పాఠాలు చెప్పేందుకు తీసుకున్నారు. నిజానికి మా వారి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు నన్ను చూసిన ఆయన అక్కడ ఉద్యోగానికి ఒప్పించారు. ఊహించకుండా చేరినా అక్కడ పెద్దస్థాయికి చేరుకున్నా. కానీ అనుకోని అనారోగ్యం బారినపడటంతో ఆ జాబ్ మానేయాల్సి వచ్చింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ ఉన్న నేత కారులు, హస్త కళాకారులతో కలిసి పనిచేస్తున్నాం. పోచంపల్లి ఇక్కత్, శ్రీకాళహస్తి కలంకారీ, బీహార్ బావన్ బుటీ, గుజరాత్ రోగన్, రాజస్థాన్ లెహరియా, ఒరిస్సా పఠచిత్ర… ఇలా ఏ ప్రింట్, వర్క్ అయినా వినియోగదారులు కోరినట్టు మా సంస్థ ద్వారా అందిస్తున్నాం. ఎనిమిది వందల నుంచి లక్షల రూపాయల ఖరీదు చేసే చీరలు మేం తయారు చేస్తాం. దేశవిదేశాల్లో మాకు కస్టమర్లున్నారు.
నాకు గురువులంటే చిన్ననాటి నుంచి ఎంతో గౌరవం. ఉస్మానియాలో నాకు చదువు చెప్పిన డా॥ హయవదన సర్గానీ, స్వెరిలో రోంగే సర్గానీ అందరితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను కోలుకున్నాక సొంతూళ్లో ఉండాలని హైదరాబాద్ వచ్చేశా. ఆ సమయంలో జరిగిన పోరాటమో, అందులో గెలిచినందుకు వచ్చిన ధైర్యమో తెలీదు కానీ… నాకు ఇక ఎవరి దగ్గరా పనిచేయాలని అనిపించలేదు. దాంతో చాలా ఏండ్ల క్రితమే కాలేజీ పెట్టి ఆంత్రప్రెన్యూర్ అయిన రోంగే సర్‌తో అభిప్రాయాన్ని చెప్పా. మావారూ, అమ్మానాన్నలతోపాటు ఆయన మరింత బలాన్నిచ్చారు. ముఖ్యంగా మనతో పాటు నలుగురికీ మేలయ్యే పనైతే ఆలోచించకుండా చేయడమే అనే మామగారి మాటలు చాలా స్ఫూర్తి నింపాయి. దాంతో తొలుత స్నేహితురాలితో వస్ర్తాల వ్యాపారం చేశాను.
తర్వాత మేమే చీరలు తయారు చేయించడం ప్రారంభించాం. నేతన్నలతోనే కాకుండా కొంతమంది టైలర్లతోనూ కలిసి పనిచేసేలా 2019లో ‘ఎ స్టిచ్ ఇన్ టైమ్’ సంస్థను ప్రారంభించా. అదే సమయంలో సినిమాలకు దుస్తులు సరఫరా చేసే అవకాశం లభించింది. మొట్ట మొదట ‘సీతారామం’ సినిమాకు చున్నీలు తయారీ కోసం ఆఫర్ వచ్చింది. నాణ్యతతో సమర్థంగా అందించడంతో ఆఫర్లు వరుస కట్టాయి. ఆ తర్వాత ‘హనుమాన్’, ‘దసరా’, ‘అన్నీ మంచి శకునములే’, ‘కల్కి’ లాంటి ఎన్నో సినిమాలకు పనిచేశాం. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ ఏడాది సంస్థ పేరును పుంటో టీఎంపో(punto tiempo)గా మార్చాం.
‘కల్కి’ సినిమా ప్రమోషన్ల సమయంలో అమితాబ్ బచ్చన్ కోసం ఒక హుడీ తయారు చేయాలి… 16 గంటల్లో అది ముంబయికి వెళ్లాలి, రేపు ఉదయం ఆయన వేసుకుంటారు… చేసివ్వగలరా’ అంటూ చిత్ర యూనిట్ అడిగింది. నేను వాళ్లు చెప్పిన టైమ్‌లో అడిగిన క్లాత్, ప్రింట్స్‌తో హుడీ చేసిచ్చా. మర్నాడు ఉదయం అభిమానుల ముందుకు బిగ్‌బీ వచ్చినప్పుడు మేం చేసిన హుడీనే వేసుకున్నారు. వృత్తిపరంగా నాకు అత్యంత ఆనందకరమైన విషయం అది. తమిళనాడుకు చెందిన చరిత్రకారిణి మీనాక్షి దేవరాజ్ తిరుప్పావైలోని 30 పాశురాలను ముగ్గుల రూపంలో వేశారు. దాన్ని ధనుర్మాసంలో కట్టుకునేలా చీరమీద వేసివ్వగలరా అని అడిగారు. చాలా కష్టపడి దానికి రూపం తేగలిగాం. ఇలాంటివి చేసినప్పుడు మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. ప్రయోగాలు చేసే ధైర్యం వస్తుంది. ఈ విషయంలో మా వారు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మరో మంచి విషయం ఏమిటంటే పాప కూడా డిజైనింగ్ గురించి బాగా ఆలోచిస్తుంది. దానికీ సృజనాత్మకత ఎక్కువ.
ఇవాళా రేపు ఆడవాళ్లు కూడా ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు. జాకెట్లకు వర్క్ చేయించాలి, డ్రెస్ మెటీరియల్ కుట్టడానికి ఇవ్వాలి, దుస్తులు ఇస్త్రీకివ్వాలి.. అనుకుం టూ వారాంతాల్లో ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ల వస్ర్తాల అవసరాల కోసం అటూ ఇటూ తిరగకుండా డైయింగ్, ప్రింటింగ్, వీవింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఐరనింగ్లాంటి సర్వీసులన్నింటినీ ఇంటికే తెచ్చిచ్చేలా పుంటోను తీర్చిదిద్దుతున్నాం. పర్యావరణహితంగా ఉండి, త్వరగా భూమిలో కలిసిపోయేలా మొడల్లాంటి వస్ర్తాలను మా డిజైనింగ్‌లో వాడుతున్నాం. ఇక, పూర్తి మహిళా ఉద్యోగులతో ఇస్త్రీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నాం. అచ్చంగా మా పుంటో ద్వారా కనీసం 500 మందికి ఉపాధి అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి
– చిన్న యాదగిరిగౌడ్