117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో ప్రతీముగ్గురు ఓటర్లలో ఒకరు దళిత వర్గానికి చెందిన వారే. అంటే దళితులు ఏ పార్టీ వైపునకు మొగ్గుచూపితే, ఆ పక్షం అధికారాన్ని చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రధాన పక్షాలు దళిత వర్గానికి చెందిన వారినే సీఎం అభ్యర్థులుగా ప్రకటించాయి.
-నేషనల్ డెస్క్
పంజాబ్ జనాభా 3.07 కోట్లు. ఇందులో 32 శాతం మంది దళితులు. ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 117 నియోజకవర్గాల్లో 34 స్థానాలను ఎస్సీ రిజర్వ్డ్గా ప్రకటించారు. ఈ స్థానాల్లో దళిత ఓటర్లు 45 శాతం కంటే ఎక్కువగానే ఉంటారు. పోటీలో నిలబడే అభ్యర్థులు కూడా దళితులే కావడం వల్ల వీరి గెలుపును నిర్ణయించేది ఇతర వర్గాల ఓటర్లే అన్నది తెలిసిందే. అయితే రాష్ట్రంలో మిగిలిన 83 స్థానాలను అన్రిజర్వ్డ్ క్యాటగిరీలో చేర్చారు. ఈ స్థానాల్లో దళిత ఓటర్ల సంఖ్య 20-43 శాతం వరకు ఉండటం గమనార్హం. అంటే మొత్తంగా 117 స్థానాలను దళిత ఓటర్లు ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తున్నట్టు గమనించవచ్చు.
ఓట్ల కోసమే
దళిత ఓటర్లను ఆకర్షించడంలో భాగంగానే ఎస్సీ కమ్యూనిటీలో 42 శాతం మంది ఓటర్లున్న రవిదాసీ సిక్కు కమ్యూనిటీకి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఎస్సీ కమ్యూనిటీలో 31 శాతం మంది ఉన్న బాల్మికి వర్గానికి చెందిన భగవంత్ మన్ను ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ కూడా ఇదే వర్గానికి చెందినవారు. తాము అధికారంలోకి వస్తే దళిత నేతను డిప్యూటీ సీఎంగా చేస్తామని ఎస్ఏడీ-బీఎస్పీ కూటమి, బీజేపీ ప్రకటించాయి.
రవిదాస్ చుట్టూ రాజకీయాలు
దళిత, రవిదాసీ కమ్యూనిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా దళితుల గురువు, సంఘసంస్కర్త రవిదాస్ జయంతిని పురస్కరించుకొని పలువురు రాజకీయ నాయకులు బుధవారం మందిరాల బాట పట్టారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉన్న ‘శ్రీ గురు రవిదాస్ విశ్రంధామ్ మందిర్’ను ప్రధాని మోదీ సందర్శించారు. భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. రవిదాస్ జయంతిని పురస్కరించుకొని ఆయన జన్మస్థలి అయిన వారణాసికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రెండు రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు చెప్పి పనిలోపనిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని నిర్వహించారు. ఇక వారణాసిలోని సీర్ గోవర్ధన్‌పూర్ మందిరాన్ని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ తెల్లవారుజామున 4 గంటలకే దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఆ మందిరాన్ని దర్శించి, భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురు రవిదాస్‌ను అనుసరించే భక్తులు, రవిదాసీ కమ్యూనిటీకి చెందిన వారు పంజాబ్‌లో 20 లక్షల వరకు ఉంటారని అంచనా.