న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలోనే తొలిసారిగా టైర్లలో పంక్చర్ గార్డ్ టెక్నాలజీని తీసుకువస్తున్నామని జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ గురువారం తెలియజేసింది. ఫోర్ వీలర్ల కోసం ఈ పంక్చర్ గార్డ్ టెక్నాలజీ టైర్లను మార్కెట్‌కు పరిచయం చేసినట్టు వివరించింది. ఆటోమెటిక్ ప్రాసెస్ ద్వారా సరికొత్త టెక్నాలజీతో టైర్ లోపల సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టమర్ ఇన్నర్ కోట్‌ను వేస్తామన్నది. టైర్ పంక్చర్ అయినప్పుడు గాలి బయటకుపోకుండా దానంతటదే మూసుకుపోవడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకతని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. 6 ఎంఎం వరకూ మందంతో ఉండే మేకులు, ఇతరత్రా ఎటువంటివైనా టైర్‌కు దిగినా ఇబ్బంది లేదని, ఇలా ఎన్నిసార్లు టైర్లు పంక్చరైనా ఎప్పటికీ ప్రయాణాన్ని సజావుగానే సాగించవచ్చని ఓ ప్రకటనలో జేకే టైర్స్ చెప్పింది. టైర్ అరిగిపోయేంతదాకా పంక్చర్ల బాధే ఉండదన్నది. 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని తెచ్చామని, ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీని అందిస్తున్నామని, వాహనదారుల సౌకర్యార్థం మున్ముందు మా ఈ కొత్త ఉత్పత్తులు వస్తూనే ఉంటాయని జేకే టైర్ సీఎండీ రఘుపతి సింఘానియా అన్నారు. దేశంలోని అన్ని రకాల రహదారులపై ఈ టైర్ల పనితీరును పరిశీలించామని, అత్యంత భద్రమైన ఈ టైర్లను ఫోర్ వీలర్ల విభాగంలో అన్ని శ్రేణుల్లో తెచ్చే యోచనలో ఉన్నట్టు చెప్పారు. అయితే ఈ టైర్ల ధర తదితర వివరాలు తెలియాల్సి ఉన్నది.