కవాడిగూడ, నవంబర్ 7: ఎంపీ అరవింద్‌ను బీజేపీ నుంచి తొలగించాలని ఆ పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రమోద్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన పదవిలో ఉండి ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అవహేళన చేస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అరవింద్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ మాల ఉప కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్, తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపకుడు కే సాయి గిరిధర్, మాల స్టేట్ జనరల్ సెక్రటరీ దుబ్బాక నవీన్ తదితరులు పాల్గొన్నారు.