మక్తల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Houses ) పంపిణీలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) డిమాండ్ చేశారు. అనర్హులకు కేటాయిస్తే ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు చిన్న హనుమంతు, అన్వర్ హుస్సేన్ హెచ్చరించారు. మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు తమకు చెందిన చోటామోటా నాయకుల పేర్లను ఇందిరమ్మ కమిటీలో చేర్చుకొని, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా అనర్హులను ఎంపిక చేసుకొన్నారని ఆరోపించారు. వారి వద్ద బేరసారాలు మాట్లాడుకోవడంతో అనర్హుల పేర్లను ఎంపిక చేశారని మండిపడ్డారు.
మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు లేని పేదవారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియలో ఫీల్డ్ సర్వేకు వెళ్లే అధికారులు నిష్పక్షపాతంగా సర్వేను చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని అన్నారు. సమావేశంలో నాయకులు జుట్ల శంకర్, నరసింహారెడ్డి, రాములు, మొగులప్ప, మన్నన్, శివారెడ్డి, అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.