తాండూర్: ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో యూనియన్( Auto Union ) అధ్యక్షుడు మహమ్మద్ పాషా ( Mohammed Pasha ) తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రపంచ ఆటో కార్మికుల (Auto workers) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 87 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పటివరకు దాని గురించి మాట్లాడడం లేదని వాపోయారు. ఇప్పటికైనా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్ల కోసం చర్చించి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఆటో కార్మికుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, మద్యం సేవించి ఆటోలు నడపరాదని సూచించారు. యూనియన్ మండల కోశాధికారి ఓరగంటి శుభాకర్, జనరల్ సెక్రెటరీ కొత్త శంకర్, ఉపాధ్యక్షుడు చాంద్ ఖాన్, సలహాదారులు విద్యాసాగర్, గౌరవ సలహాదారులు రాజనంద్, కార్య నిర్వాహక సభ్యులు రేగుల రవి, వివిధ అడ్డాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.