గండీడ్ : ఇందిరమ్మ ఇండ్ల (Indiramma houses) నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ( Collector Vijayendira Boi ) అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ (Gandid) మండలం జానంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఆమె పరిశీలించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషిచేయాలన్నారు.
అనంతరం ఆమె అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి మొక్కను నాటారు. కేంద్రంలో వండిన పోషక ఆహారాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ.పి నమోదును, లేబర్ రూంను పరిశీలించారు. ప్రతి నెల ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే ప్రసవాల గురించి వాకబు చేశారు. గత నెల 13 నుంచి ఇప్పటి వరకు 7 ప్రసవాలు జరిగాయని సిబ్బంది వివరించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు.
ఆరోగ్య కేంద్రానికి వచ్చిన కేజీబీవీ విద్యార్థినీలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రం లోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు చెత్తతో అపరిశుభ్రంగా ఉండడం గమనించి వెంటనే పరిశుభ్రం చేయాలని స్పెషల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతులు, మెనూ ప్రకారమే భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ బి మల్లికార్జున రావు, మండల అధికారులు ఉన్నారు.