Akhanda 2 | నందమూరి బాలకృష్ణ (Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల వాయిదా పడటం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు స్పందించారు. ‘అఖండ 2’ వాయిదాకు గల అసలు కారణాలను బయటపెట్టకుండా అనవసరపు ఊహాగానాలకు తెరదించారు.
ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ బాబు ‘అఖండ 2’ ఇష్యూ గురించి ప్రస్తావిస్తూ.. నేను కూడా ఆ సమస్య గురించి మాట్లాడాటానికే వెళ్లాను. త్వరలోనే ‘అఖండ 2’ సమస్య పరిష్కారమవుతుంది. అఖండ 2 కి సంబంధించి అన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులే అవి బయటకు వెల్లడించకూడదు అని అన్నారు. అలాగే సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. ఇది దురదృష్టకరం. ప్రతిఒక్కరూ ‘అఖండ 2’ రిలీజ్ కాకపోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. అన్ని కోట్లు చెల్లించాలట అని రాస్తున్నారు. అవి అన్నీ అనవసరపు ప్రస్తావనలు అని సురేష్ బాబు స్పష్టం చేశారు. ఆడియన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదలవుతుంది. అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.