Punarnavi Bhupalam | ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం మరోసారి వార్తల్లో నిలిచింది. తన అందం, తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పునర్నవి, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.బిగ్బాస్ లోకి అడుగు పెట్టే ముందే ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఎమో, ఒక చిన్న విరామం, సైకిల్ వంటి చిత్రాల్లో నటించిన పునర్నవి, షో తర్వాత వచ్చిన అవకాశాలను పక్కన పెట్టి లండన్లో సైకాలజీలో హయ్యర్ స్టడీస్ కొనసాగిస్తోంది.
లండన్లో చదువులు కొనసాగిస్తున్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన జీవితం గురించిన అప్డేట్స్ షేర్ చేస్తోన్న పునర్నవి, తాజాగా ఒక పెద్ద సర్ప్రైజ్తో అభిమానుల్ని ఖుషీ చేసింది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటిస్తూ, తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. పునర్నవి తన వరుడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “నేను అతడికి YES అని చెప్పాను” అనే క్యాప్షన్ జత చేసింది. అందులో పునర్నవి ప్రపోజ్ చేస్తున్న ఫోటో కూడా ఉండటంతో, ఆ పోస్టులు నిమిషాల్లో వైరల్ అయ్యాయి.
అభిమానులు, నెటిజన్లు ఇద్దరికి శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఆమెకు కాబోయే భర్త పేరు హేమంత్ వర్మగా తెలిసింది. అయితే అతడి వృత్తి వంటి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇదిలావుండగా, హేమంత్ వర్మ కూడా తన సోషల్ మీడియాలో పునర్నవితో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, “నాకు కావాల్సింది దొరికింది… నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఆగలేకపోతున్నాను” అని రాశాడు. దీంతో ఈ జంట తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.పునర్నవి–హేమంత్ జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుండగా, అభిమానులు త్వరలోనే వారి పెళ్లి వివరాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.