Rakul Preet Singh | టాలీవుడ్లో టాప్ హీరోలందరితో నటించి స్టార్ ఇమేజ్ సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్, వరుస ఫ్లాపుల కారణంగా బాలీవుడ్‌కు మకాం మార్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న రకుల్, అత్తింట్లో అడుగుపెట్టగానే వారి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక ఇబ్బందుల్లో పడిందనే వార్తలు గత కొన్ని రోజులుగా తీవ్రంగా చక్కర్లు కొడుతున్నాయి.అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం సాధించింది. దాదాపు ₹350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, రూ.100 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేకపోయింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా, మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఆలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేశారు. భారీ నష్టాల కారణంగా జాకీ భగ్నానీ వ్యవస్థాపకులైన ‘పూజా ఎంటర్టైన్మెంట్’ కంపెనీని మూసివేస్తున్నారంటూ వార్తలుఅందరిని షాక్‌కి గురి చేశాయి. కొత్తగా పెళ్లైన రకుల్ కూడా దీనివల్ల ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చారంటూ వివిధ కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్‌పై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తూ రకుల్ మాట్లాడుతూ..“సోషల్ మీడియా యుగంలో మంచి కంటే చెడు వార్తలు వేగంగా వ్యాపిస్తాయి. నిజానిజాలు తెలుసుకోకుండా సెన్సేషనల్ న్యూస్‌ను బ్రేకింగ్‌గా మారుస్తారు. వరుస ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడంతో కొంచెం ఆర్థిక ఒత్తిడులు ఉన్నాయనేది నిజమే… కానీ పూజా ఎంటర్టైన్మెంట్ను మూసేయడం లాంటిది ఏమి లేదు” అని స్పష్టం చేసింది.
అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు కూడా కెరీర్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను గుర్తుచేస్తూ సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు సహజమని రకుల్ తెలిపారు. ఇదిలా ఉండగా, పూజా ఎంటర్టైన్మెంట్ ముంబై ఆఫీసును ₹250 కోట్లకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగే ఉద్యోగుల సంఖ్య తగ్గించారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను కూడా రకుల్ పూర్తిగా కొట్టిపారేసింది. ‘బడే మియాన్ చోటే మియాన్’కు ముందు ఈ బ్యానర్లో వచ్చిన ‘గణపత్’, ‘మిషన్ రాణిగంజ్’, ‘బెల్ బాటమ్’ సినిమాలు కూడా భారీ నష్టాలకు గురయ్యాయి. ఇటీవల రకుల్ ప్రీత్, అజయ్ దేవగణ్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, జావెద్ జాఫ్రీ, గౌతమి కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.