సిటీబ్యూరో: నగరంలో బస్సెక్కాలంటే వయోవృద్ధులు జంకుతున్నారు. కిటకిటలాడుతూ వస్తున్న బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు. అందులోనూ నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత పథకంతో బస్సులన్నీ రద్దీని తలపిస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో బస్సుల్లో వేలాడుతూ ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉంది.
గ్రేటర్లోని 25 డిపోల నుంచి నడిచే 2900 బస్సులు ఇలానే దర్శనమిస్తున్నాయి. కాగా, దూర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని రమణమ్మ అనే ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రయాణికుడు నాగేశ్వర్ రెడ్డి వయో వృద్ధులకు బస్సులో సీట్లు ఎక్కువగా కేటాయించాలని.. ఆ సీట్లలో వాళ్లే కూర్చునేలా కండక్టర్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.