హాలీవుడ్ చిత్రసీమలో జయకేతనం ఎగరేస్తున్నది గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా. ఆమె నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్’ ఈ నెల 22న అమెరికాలో విడుదలకానుంది. సైంటిఫిక్ క్లాసిక్ ‘మ్యాట్రిక్స్’ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్‌స్కేర్ వద్ద నిర్వహించిన ప్రమోషన్లో ప్రియాంకచోప్రాకు సంబంధించిన భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఇందులో ఆమె వినూత్నమైన ఆహార్యంతో చూపరులను ఆకట్టుకుంది.
ప్రియాంకచోప్రా పాత్ర ఏమిటన్నది ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చిత్రణ అత్యంత శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. టైమ్ స్కేర్ వద్ద ప్రియాంక చోప్రా పోస్టర్‌ను వీక్షించిన చాలా మంది ఇండియన్స్ భారతీయ వనిత పేరుప్రఖ్యాతుల్ని ఆమె ఘనంగా చాటారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకచోప్రా మ్యాట్రిక్స్ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రియాంకచోప్రా అమెరికా కేంద్రంగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నది. భర్త నిక్‌జోనాస్‌తో కలిసి అక్కడే నివాసముంటున్నది.