భారత్ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకున్నది. చైనాతో మనకు సరిహద్దు సమస్యలున్నాయి. చైనాకు అమెరికాకు పొసగదు. అయినప్పటికీ, ఈ రెండు దేశాలూ పాకిస్థాన్‌కు ఎంతో దగ్గర. ఇప్పుడు అలాంటి పాక్‌తో మనం ఘర్షణలకు దిగాం. ఇక, భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవులతోనైనా మనకు సత్సంబంధాలున్నాయా? అంటే, అవును అంటూ గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ గమనించే.. ప్రధాని మోదీ ‘ఇది యుద్ధాల సమయం కాదు.. బలంగా ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది’ అని ప్రకటించారు. ఇక్కడ బలమంటే సైనిక శక్తి మాత్రమే కాదు, దేశ ఆర్థిక స్థిరత్వం కూడా. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశానికి ఇప్పుడు ఆర్థికపరిపుష్ఠి ఎంతో అవసరం.
22 ఏండ్లు కష్టపడాల్సిందే..: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ‘వికసిత్ భారత్’ పేరిట ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక పరిమాణం విషయంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇది జరుగాలంటే వచ్చే 22 ఏండ్ల పాటు భారత జీడీపీ వృద్ధిరేటు కనీసం 7.8 శాతంగా నమోదవ్వాలని గత నెలలో ప్రపంచబ్యాంకు ఓ నివేదికలో వెల్లడించింది. అయితే, గడిచిన ఆర్థిక సంవత్సరం మన జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగానే నమోదైంది. 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చెప్తున్న భారత్.. ఏటికేడాది 8.5 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తే ప్రతీ సంవత్సరం 340 బిలియన్ డాలర్ల సొమ్ము ఆర్థికవ్యవస్థకు అదనంగా చేకూరుతుంది. ఇది పాకిస్థాన్ మొత్తం జీడీపీకి సమానం. ఇంతటి సొమ్ము ఏటికేడాది మన ఆర్థికవ్యవస్థకు అదనంగా జత కలిస్తేనే, రక్షణ దళానికి అవసరమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసుకోగలం. లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయగలం. అది జరుగని పక్షంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దలేం. ప్రపంచంలో మనది ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా కొందరు చెప్పుకొంటున్నారు. అయితే, ఇదే సమయంలో దేశంలో ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం ఎంత ఉన్నదో కూడా చూడాల్సి ఉంటుంది. దేశంలో జనాభా పెరుగుతూనే ఉన్నది. దీనికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థ పరిమాణం పెరగాల్సి ఉంటుంది. త్వరలో మూడో స్థానంలో ఉన్న జర్మనీని కూడా మనం దాటేయగలమేమో గానీ, చైనాను కాదు. ఎందుకంటే ఆర్థిక పరిమాణంలో చైనాకు, మనకు ఎంతో అంతరం ఉన్నది.
మూడు విడతలు ఇలా..: మన్మోహన్సింగ్ను ప్రధానిగా కంటే ఆర్థికమంత్రిగా ఎక్కువగా గుర్తిస్తారు. 90వ దశకంలో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే దీనికి కారణం. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు జీడీపీ వృద్ధిరేటు 1.25 శాతం నుంచి 7.5 శాతం వరకూ ఎగబాకింది. ఐదేండ్ల వ్యవధిలో విదేశీ మారక నిల్వలు నాలుగు రెట్లు పెరిగాయి. పేదరికం స్థాయిలూ తగ్గుముఖం పట్టాయి. ఇక, మోదీ మూడు పర్యాయాల పాలన విషయానికి వస్తే.. తొలి విడతలో హామీలతో నింపారు. మేకిన్ ఇండియా, జీఎస్టీ, ఎఫ్‌డీఐ, భూ సంస్కరణల పేరిట పలు వాగ్దానాలు ఇచ్చారు. భూ సంస్కరణల హామీ ఎప్పుడో అటకెక్కింది. ఇక, రెండో పర్యాయం అంతా.. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, సాగుచట్టాలు, కరోనా సంక్షోభంతో కొనసాగింది. మూడోసారి అధికారం చేపట్టి ఏడాది గడిచినప్పటికీ, గొప్ప నిర్ణయాలేమీ కనిపించట్లేదు.
పదునులేని పథకాలు: వ్యాపారం చేయడం ప్రభుత్వం పనికాదంటూ ప్రభుత్వరంగ సంస్థ ల్లో (పీఎస్‌యూ) పెట్టుబడుల ఉపసంహరణకు మోదీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. అయితే, లాభాల్లో ఉన్న సంస్థలను విక్రయించడంపై విమర్శలు వచ్చాయి. ఒక్క ఎయిర్ ఇండియా విక్రయమే సజావుగా సాగినట్టు చెప్తారు. ఇదే సమయంలో ‘మేకిన్ ఇండియా’ లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం చేరుకోలేకపోయింది. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా జీడీపీలో తయారీరంగం వాటాను 25 శాతానికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగం వాటా 13 శాతానికి పడిపోయింది. 1967 తర్వాత ఇదే కనిష్ఠం. ఇక, 2015లో తీసుకొచ్చిన ‘స్కిల్ ఇండియా’ పథకం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2022 నాటికి దేశంలో 40 కోట్ల మంది యువతకు నైపుణ్యాన్ని మెరుగుపర్చాల్సి ఉండగా, 4 కోట్ల మందికి కూడా ఈ పథకం కింద శిక్షణను ఇవ్వలేకపోయారు. చైనా శ్రామిక శక్తిలో 60 శాతం మందిలో నైపుణ్యాలుంటే, భారత్‌లో ఇది 10 శాతానికి మించి ఉండదు. ఇలాంటి సమయంలో జీడీపీ వృద్ధిరేటు ఎలా పరుగు పెడుతుందన్నది ప్రధాన ప్రశ్న.
నల్ల చట్టాలపై బ్యాక్ స్టెప్: దేశంలో 45 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, జీడీపీలో సాగురంగం వాటా 15 శాతంగానే ఉన్నది. ఇక, 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. తమను సంప్రదించకుండా తీసుకువచ్చిన ఈ నల్ల చట్టాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని అన్నదాతలు తెగేసి చెప్పారు. ఆందోళనలు మిన్నంటడంతో దిగివచ్చిన ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకున్నది. ఒకవేళ, నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టు వ్యవసాయ దిగుబడిని పెంచి, రైతుల క్షేమం కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చినట్టయితే, రైతులతో ముందే ఎందుకు సంప్రదింపులు చేపట్టలేదు? ప్రభుత్వాన్ని ఏ శక్తి ఆపింది? ఇక, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.
ఇండియా ఎట్ క్రాస్‌రోడ్స్: పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పార్టీలతో సంబంధం లేకుండా అన్నిపక్షాలూ ఏకతాటిమీదికి వచ్చాయి. ఇప్పు డు దేశార్థికాభివృద్ధికి ప్రధాని మోదీ అందరినీ ఏకతాటిమీదికి తీసుకురావాలి. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తామన్న ప్రధాని.. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ను మార్చడానికి కూడా అలాంటి రాజీలేని పోరాటమే చేయాలి. ఇప్పుడు భారత్ కూడలిలో ఉన్నది. 6.5 శాతం వృద్ధిరేటుతో గల్లీ ప్లేయర్‌గా ఉంటుందో, లేక ఆర్థిక సంస్కరణలతో 10 శాతం వృద్ధిరేటు సాధించి గ్లోబల్ ప్లేయర్‌గా మారుతుందో చూడాలి. అప్పుడే దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సైన్యానికి అవసరమైన డ్రోన్లు, ఆయుధాలను కొనగలం. 1991లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని మన్మోహన్ ఓ అవకాశంగా మలుచుకొన్నారు. ఇప్పుడు మోదీ కూడా అదే పనిచేయాలి. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియాను రీలోడ్ చేయాలి. రాజకీయాలకు సమయం ఉండనే ఉన్నది. అయితే, వృద్ధిరేటు మాత్రం మన కోసం వేచిచూడదు. మూడు దశాబ్దాల నిర్విరామ కృషి ఫలితంగానే చైనా ఆర్థికాభివృద్ధి సాధించింది. భారత్ కూడా ఆర్థికరంగంలో ముందుకుసాగాలంటే ఇప్పుడు మోదీ తనలోని ఆర్థిక సంస్కరణల మన్మోహన్‌ను నిద్రలేపాలి గానీ, సోషలిస్ట్ పాలసీలు పెనవేసుకున్న నెహ్రూను కాదు.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
మేకిన్ ఇండియా ఇలా..
ఎంతకు దిగజారిందంటే?
స్కిల్ ఇండియా ఇలా..
‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యం చేరాలంటే?
-కమలేశ్ సింగ్