హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు వెళ్లిరావచ్చు కానీ, తాను వెళ్లి న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలిస్తే తప్పవుతుందా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీకి తెలంగాణ అంటే వివక్ష, చిన్నచూపు అని మండిపడ్డారు. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటన వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే అందించానని, ఇంగ్లండ్ పర్యటనకు అనుమతించిన కేంద్రం.. అమెరికాకు కేవలం రాజకీయ కారణాలతోనే అనుమతులు నిరాకరించిందని ఆరోపించారు. తన పర్యటనలో ఉన్నత విద్యాసంస్థలను, ప్రపంచంలోనే గొప్ప స్కాలర్లను, మేధావులను కలుద్దామనుకున్నానని చెప్పారు.
గుజరాతీగానే వ్యవహరిస్తున్న మోదీ
మోదీ ఇంకా గుజరాతీలాగనే ఆలోచిస్తున్నారని, ప్రధానమంత్రిగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 28 వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించేందుకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు కేంద్రం అనుమతులు ఇచ్చిందని, గుజరాత్‌కు ఒక న్యా యం.. తెలంగాణకో న్యాయమా? అని సీఎం ప్రశ్నించారు.
భట్టి, ఉత్తమ్ కోసం వేచి చూసి..
సీఎం ప్రెస్‌మీట్ సాయంత్రం 4గంటలకు ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులతోపాటు విప్‌లు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి హాల్లో కూర్చున్నారు. 4.15 గంటల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారు. సీఎం పక్కన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోసం రెండు కుర్చీలను ఖాళీగానే ఉంచారు. వారు ఎంతకూ రాకపోవడంతో ఖాళీ సీట్లలో అటూఇటూ పక్కన ఉన్న సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను వచ్చి కూర్చోవాలని, ఇక ప్రెస్‌మీట్ మొదలుపెడ్దామని సీఎం చెప్పారు. వారు కూర్చొని, ప్రెస్‌మీట్ మొదలయ్యాక కాసేపటికి భట్టి, ఉత్తమ్ ప్రెస్‌మీట్ హాల్లోకి వచ్చారు. వారు రావడంతో సీతక్క, పొంగులేటి సీఎం పక్కన ఉన్న సీట్లను ఖాళీ చేసి సర్దుబాటు చేసుకున్నారు. సీఎం సీటు సహా ప్రెస్‌మీట్ వేదికపై 40 సీట్లు వేశారు. ఇప్పుడూ 40మందేనా? అని అక్కడున్న అధికారులను మీడియా ప్రతినిధులు అడుగడం గమనార్హం. రేవంత్‌రెడ్డి సోమవారం ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని వస్తే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా ఎయిర్పోర్ట్ కు రాలేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.