దుండిగల్, ఆగస్టు 24: దుండిగల్ సర్కిల్ కార్యాలయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం మరోసారి సందర్శంచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టౌన్ ప్లానింగ్ విభాగం ఫైళ్లను పరిశీలించారు. మొత్తం నలుగురు ఏసీబీ అధికారుల బృందం మూడు గంటల పాటు కార్యాలయంలోనే ఉండి ఆరునెలల కిందట సర్కిల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో టౌన్ ప్ల్లానింగ్ విభాగంలో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించి..అప్పటి టౌన్ ప్ల్లానింగ్ ఆఫీసర్(టీపీవో) సంజునను సస్పెండ్ చేయాలని సూచించడంతో ప్రభుత్వం ఆమెను విధుల్లోంచి తొలగించింది.
అయితే ఈ కేసుకు సంబంధించి సాక్షిగా ఉన్న పిచ్చిరెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం ఏసీబీ అధికారులకు అందుబాటులోకి రాకపోవడంతోనే సోమవారం సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించినట్లు దుండిగల్ డీసీ డా.ఎస్,మణికరణ్ తెలిపారు. అదే సమయంలో సంజున హయాంలోని నిర్మాణ అనుమతులకు సంబంధించిన మరికొన్ని పత్రాలను ఏసీబీ అధికారులు సేకరించినట్లు పేర్కొన్నారు. దీంతో సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల్లో మరోసారి గుబులు మొదలైనట్లు తెలుస్తున్నది. మళ్లీ ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.
టీపీఎస్‌పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయంటూ..
కాగా, దుండిగల్ సర్కిల్లో టౌన్ ప్ల్లానింగ్ సూపర్వైజర్ ఎవరంటూ ఏసీబీ అధికారులు సోమవారం ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. మూడునెలల కిందట ఇక్కడ టీపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి వచ్చి రావడంతోనే అనుమతుల్లేని నిర్మాణాల వద్ద వసూల్లే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు టీపీస్ గురించి ఆరాతీసినట్లు తెలుస్తున్నది. పైగా అతనిపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి.
ఏసీబీ అధికారుల ఆరాకు అనుగుణంగానే సదరు టౌన్ ప్ల్లానింగ్ అధికారి గండిమైసమ్మలోని ఓ ఇంటిలో తన వ్యక్తిగత కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని నిర్మాణదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి.తన వద్దకు వచ్చే భవననిర్మాణ అనుమతుల ఫైళ్లను షార్ట్‌ఫాల్(పెండింగ్)లో పెడుతూ అక్రమవసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా దుండిగల్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని దర్గా ఎదురుగా ఉన్న సెల్లార్ వద్ద, బహదూర్‌పల్లి వార్డు కార్యాలయం వెనుక ఉన్న భవన యజమానుల నుంచి పెద్దమొత్తంలో లక్షల్లో దండుకున్నట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన పేరు చెబితేనే నిర్మాణదారులు/ బిల్డర్లు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తున్నది.
సదరు అధికారి ఎక్కడ పనిచేసినా వసూళ్లపర్వమేనని పలువురు పేర్కొంటున్నారు. గతంలో కుత్బుల్లాపూర్/గాజులరామారం సర్కిల్లో విధులు నిర్వహించిన సమయంలోనూ ఆదే తరహాలో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండురోజుల కిందట అంజయ్యనగర్‌లో ఏడు అంతస్తుల భవనం కూలిన నేపథ్యంలో అక్రమ/అనుమతుల్లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టౌన్ ప్ల్లానింగ్లో ఉన్న అవినీతి అధికారులపైనా కమిషనర్ దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాగా, సదరు అధికారి నిజాంపేట్ సర్కిల్ ఇన్చార్జి టీపీఎస్గాను గతకొన్ని రోజులుగా విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. సదరు అధికారి ప్రవర్తనపైనా నిజాంపేట్ డీసీ అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సేవలు తమకు వద్దంటూ డీసీ ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తున్నది.