స్నేహానికి ప్రాణమిస్తుంది సమంత. జిమ్‌లో వర్కవుట్స్ మొదలుకొని..విహార యాత్రల వరకు ఆమె పక్కన ఫ్రెండ్స్ ఉండి తీరాల్సిందే. పరిశ్రమలో సమంతకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో దర్శకురాలు నందినిరెడ్డి ఒకరు. ఆమె దర్శకత్వంలో సమంత ‘జబర్దస్త్’ ‘ఓ బేబీ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నందినిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది. ఒకానొక దశలో తాను తీవ్రమైన కుంగుబాటుకు లోనైనప్పుడు నందినిరెడ్డి మానసిక స్థెర్యాన్నిచ్చిందని సమంత పేర్కొంది. తన జీవితంలోని ఉత్థానపతనాలన్నింటిలో తోడుగా నిలిచిన గొప్ప స్నేహితురాలు నందినిరెడ్డి అని కొనియాడింది. ‘2012లో నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నా. పనిలోకి వెళ్లాలంటే ఏదో తెలియని భయం వెంటాడేది. అప్పుడు నువ్వు ప్రతి రోజు నా ఇంటికి వచ్చేదానివి. మంచి మాటలు చెబుతూ నాలో విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశావ్. నీ మాటల స్ఫూర్తితో కొద్ది రోజుల్లోనే తిరిగి సెట్స్‌లోకి ధైర్యంగా అడుగుపెట్టగలిగాను. వెలకట్టలేని స్నేహం మనది. నీకు జన్మదిన శుభాకాంక్షలు’ అని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.