Onion Price | న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశంలో ఉల్లి ఘాటు మరింత పెరిగింది. నిన్న మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లలో రూ.40-60 పలికిన కిలో ఉల్లిపాయల ధర.. ఇప్పుడు రూ.70-80కి చేరింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర పలికింది. దీంతో కుటుంబ బడ్జెట్లు తల్లకిందులై వినియోగదారులు అల్లాడుతున్నారు. ద్రవ్యోల్బణంతోపాటు ఉల్లి కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు.
మండీల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగిందని, అమ్మకాలపై ప్రభావం చూపుతుండటంతో విక్రయాలు తగ్గాయని, అయినప్పటికీ రోజువారీ ఆహారంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న ఉల్లిపాయలను జనం కొంటూనే ఉన్నారని ఢిల్లీ మార్కెట్లోని ఓ వ్యాపారి తెలిపారు. ధరల పెరుగుదలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి ధర కూడా రెట్టింపు కావడంతో కుటుంబ బడ్జెట్ను దెబ్బతీస్తున్నదని కొనుగోలుదారులు వాపోతున్నారు.