– తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు
చివ్వెంల, మార్చి 30 : తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులు సరికాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గత ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమ సంఘాలు నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో -ఆర్డినేటర్ అనంతుల మధు, నాయకులు భాషిపంగు సునీల్, ఏనిగా సంతోష్ రెడ్డి, భూక్యా నాగు నాయక్ ను చివ్వెంల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా అనంతుల మధు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు గత ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా నేటికీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే, హామీలను అమలు చేసే ప్రక్రియపై నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమకారులను ముందస్తు అక్రమ అరెస్ట్ లు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తక్షణమే చట్ట పరమైన సబ్ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ ముందస్తు అరెస్టులో చివ్వెంల ఎస్ఐలు మహేశ్, రత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.