Ramayanam | సినిమాల్లో తప్ప లవ్ లెటర్లు ఎలా వుంటాయో నాకు చాలా రోజుల వరకూ తెలియదు. మా నాన్నకు ఊరిలో ఉన్న మంచి పేరుకో, మేము మగపిల్లలతో ఎక్కువ చనువుగా ఉండకపోవడంతోనో, మరెందుకో తెలియదు గానీ, మాకెప్పుడూ ప్రేమలేఖలు రాలేదు. మా క్లాస్‌మేట్స్‌లో కూడా ఎవరికీ ప్రేమలేఖలు వచ్చిన దాఖలాలు లేవు.
మేము చూసిన కొన్ని సినిమాల్లో హీరోయిన్‌కి ప్రేమలేఖ ఎవరైనా ఇస్తే.. వెంటనే పరపరా చింపి ఇచ్చినవాడి ముఖాన్నే ముక్కలు చేసి విసవిసా నడిచి పోవడమో, అతని చెంప చెళ్లుమనిపించడమో, ప్రిన్సిపాల్‌కి రిపోర్ట్ చేయడమో జరిగేది. అందుకని ప్రేమలేఖ అంటే అదేదో చాలా తప్పు విషయం అన్న ముద్ర పడిపోయింది. మరికొన్నేళ్లకు చలం ‘ప్రేమలేఖలు’ పుస్తకం చదివాకనే ‘ప్రేమలేఖలు ఇంత బాగా కూడా రాయొచ్చా? వాటికి ఇట్లా సాహిత్య విలువ కూడా వుందా?’ అనే భావన కలిగింది.
ఇంతకూ విషయమేమిటంటే మా అక్క వాళ్ల క్లాసులో వెంకటేశ్వర్లు అనే పిల్లగాడు వుండేవాడు. అతడు తెలివైన విద్యార్థి. టెంత్ అయిపోగానే ఇంటర్ కోసం వరంగల్‌లో కాలేజీలో చేరాడు. అతనో ప్రేమలేఖ రాశాడు. ఎవరికో కాదు, మా కజిన్ కే! మా ఇద్దరు కజిన్స్ నా కంటే పెద్దవాళ్లే అయినా, నా తరువాత క్లాసులో వుండేవారు. అందులో సరళక్క చాలా ఆకర్షణీయంగా, ఉత్సాహంగా వుండేది. అందరితోనూ హుషారుగా మాట్లాడుతూ వుండేది. వాళ్ల మేనమామల్లో ఇద్దరు హైదరాబాదులో వుండడం వల్ల తను సెలవుల్లో హైదరాబాదుకు వెళ్లేది.
నేను ఇంటర్ లో చేరిన కొత్తలో ఓసారి సరళక్క హైదరాబాదులో నేనున్న యింటికి వచ్చింది. నాయనమ్మ ముందే నాతో ‘రేపు సెలవే కదా, మా మామయ్య వాళ్లింటికి రావే రమా!’ అని ‘రేపు పంపించండి నాయనమ్మా!’ అనడిగింది. ‘దానిష్టం’ అన్నది నాయనమ్మ. మొత్తానికి నేను వెళ్లిన కొద్దిసేపటికి సరళక్క నాతో ‘మనం పబ్లిక్ గార్డెన్ల జూ పార్క్‌కు పోదామనే?’ అనడిగింది. ‘ఎందుకు?’ అన్నాను నేను. కాస్సేపటికి ‘నాకొక ఉత్తరం ఒచ్చిందే!’ అని చాలాసేపు తటపటాయించి ఉత్తరం చూడమని నాకిచ్చింది. అది ఇలా ఉంది.
‘మై డియర్! నేను హైదరాబాదుకు వచ్చాను. మనం ఎక్కడో ఒక దగ్గర కలుసుకుని మాట్లాడుకోవాలి కదా! నువ్వు పబ్లిక్ గార్డెన్లో ఉన్న జూ పార్క్ దగ్గరికి వచ్చే ఆదివారం మూడింటికి వస్తే మాట్లాడుకోవచ్చు. నువ్వు మీ ఇంటికి ఏవైనా పంపించాలంటే అక్కడికి తీసుకొస్తే నేను తీసుకపోయి ఇవ్వగలను. నీ ఫోటో చాలా బాగుంది. నువ్వు నవ్వుతుంటే శానా అందంగా వున్నావు. ఇంకా ఎన్నో మాట్లాడేవి వున్నాయి. మరి పింక్ డ్రెస్సు గానీ, బ్లూ డ్రెస్సు గానీ ఏసుకొని రా. ఎదురు చూస్తుంటా. తప్పక రావాలి.- ఇట్లు వెంకట్.’
వెంకట్ ఎవరే!’ అన్నాను మొదటి సారి ప్రేమలేఖను చూసిన థ్రిల్ లో. ‘ఓహో! ఇంతేనా? ఇదేదో బ్రహ్మపదార్థం అనుకున్నా మొన్నటిదాకా!’ అని మనసులో అనుకున్నాను. ‘గదెనే! సంధ్యక్క వాండ్ల క్లాస్మేట్ వెంకటేశ్వర్లు! ‘తను అక్క కంటే కూడా పెద్దదే అయినా అక్కను సంధ్యక్క అనే పిలిచేది. ‘గాయినె నీకెట్ల పరిచయం? అయినా గూడా మీ మామయ్య వాండ్ల అడ్రస్ ఆయినెకు ఎట్ల తెలిసింది? నువ్వు గిన ఇచ్చినవా?’ అడిగాను. ‘ఎహె! నేనెందుకిస్త? మా తమ్ముడు గిన ఇచ్చిండు గావొచ్చు!’ అన్నది. ఆ తమ్ముడయినా ఎందుకు ఇవ్వాలో నాకేమీ అర్థం కాలేదు.
‘మరి నువ్వు ఫొటోల మస్తు అందంగ ఉన్నవని రాసిండు గద! నీ ఫోటో ఆయినకు ఎట్ల పోయింది? అయినా మనం టెంత్ల బోర్డు ఎగ్జామ్స్‌కు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు దిగుతం గదా! అవ్వి నవ్వుకుంటు ఎందుకు దిగుతం? అందరికి ప్రభాకర్ ఫొటో స్టూడియో వెంకట నారాయణ ఒక్క తీరుగనే మొకమంత ముడుచుకున్నట్టు తీస్తడు గద! ఇది వేరే ఫొటోనా’ అని కూడా అడిగాను. ‘ఎమో! నా ఫోటో ఎట్ల పొయ్యిందో గూడ తెలుస్త లేదు’ అంది.
‘మరేం జేస్తవు ఇప్పుడు? పబ్లిక్ గార్డెన్‌కు పోతవా?’ అన్నాను. ‘కాదే! నాకస్సలు ఏం జెయ్యాల్నో అర్థమయిత లేదు. మనిద్దరం పొయ్యి గాయినకు జెప్దామా! గిట్ల లెటర్లు రాయొద్దని! మా ఇంట్ల తెలిస్తే తిడ్తరని!’
‘గా దానికి అక్కడిదాంకా పొయ్యి చెప్పుడు ఎందుకు? పోకుంటె అయిపాయె! చూసి చూసి ఎళ్లిపోతడు’
‘కాదే, అడ్రెస్సు పట్టుకోని ఇంటికొస్తె ఎట్ల? మా మామయ్య, అత్తయ్య, అందరుంటరు. నాకు భయమైతుందే!’ ‘ఒస్తే చెప్పొచ్చు.. ఇట్ల ఇంటికి రావొద్దని, లేకపోతె మీ మామయ్య తోనే చెప్పియ్యొచ్చు’
‘అంతేనంటవా.? ఎమోనే.. నీకున్నంత ధైర్యం నాకు లేదు.’ ‘సరే గాని, నువ్వేమనుకుంటున్నవు?’ అన్నాను. ‘నీకు ఇష్టమేనా? ఇంట్రెస్టుందా?’ అని అడగడం అప్పట్లో తెలియదు.
‘ఛీ ఛీ! నేనేం అనుకుంట! నాకసలు బాగ కోపమొస్తుంది’ అంటూ మళ్లీ తనే ‘రమా! నాకొక హెల్ప్ చేస్తవానే ప్లీజ్!’ అడిగింది. చెప్పమన్నాను. ‘పెదనాయనకు ఈ సంగతి చెబ్దామానే! మా నానకయితె కోపమొస్తది. పెదనాయిన ఏమనడు. వెంకటేశ్వర్లును పిలిపిచ్చి మందలిస్తడు. ఈ లొల్లి వుండదు. అయితే, లెటర్ నాకొచ్చిందని కాకుండ నీకొచ్చిందని చెబ్దాం. సరేనా!’ అంది. పెదనాయన అంటే మా నాన్న. ‘సరే..మా నానకే చెప్పుదాం తియ్యి, నువ్వు పరేషాన్ గాకు. నాకు ఒచ్చిందని చెప్పుడు ఎందుకు? నీకు లెటర్ ఒచ్చిందంటే మటుకు నాన అడుగడా!
మళ్ల ఊరికి పోయినపుడు చెబ్దాం’ అన్నాను. వెంకటేశ్వర్లు ఎందుకు సరళక్క విషయంలో ఇంత చొరవ చేశాడో, ఒక్క ఉత్తరానికే తను ఎందుకు ఇంత భయపడుతోందో అర్థం కాలేదు నాకు. ‘అహ.. అట్ల గాదులే! నా పేరు బయిటికి రావొద్దని!’ అన్నది. మన తప్పే లేనప్పుడు భయపడ్డం ఎందుకు అనిపించింది. అయినా మా నాన్న అతన్ని పిలిచి ‘అట్లా ఉత్తరాలు రాయొద్దు, తప్పు’ అని చెబుతాడు, అంతే! అనుకున్నాను. కానీ, ఆ విషయం అంత చిన్నగా పోలేదని తరువాత తెలిసింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి