Pregnant Women | ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని మనందరికీ తెలిసిందే. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు వంటి సమస్యలు తలెత్తడంతో పాటు మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మ్రైకోవేవ్ చేసిన ఆహారాలు, ఇన్స్టాంట్ మీల్స్, ప్యాక్ చేసిన చీజ్, బ్రెడ్, ఫ్రోజెన్ పిజ్జా, కేక్స్, కుక్కీస్, చక్కెర కలిగిన తీపి పానీయాలు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకే వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అయితే తాజా అధ్యయనాలు మరో భయానకమైన విషయాన్ని బయటపెట్టాయి. గర్బిణీ స్త్రీలు ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు.
ప్రొపియోనిక్ యాసిడ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లో పీటీఈఎన్ లేదా ఏకేటీ పాత్ వే మాడ్యులేషన్ ద్వారా గ్లియోసిస్, న్యూరో ఇన్ఫ్లామేషన్ ను ప్రేరేపిస్తుంది అనే శీర్షికతో కూడిన అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో ప్రచురించబడింది. గర్భిణీ స్త్రీలు, సంతానాన్ని ఆశించే మహిళలు జంక్ ఫుడ్ ను, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలల్లో ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. సెంట్రల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయాన్ని చేపట్టారు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో ప్రొపియోనిక్ యాసిడ్ ( పీపీఏ) ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల న్యూరో స్టెమ్ సెల్స్ లో మార్పులు జరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ యాసిడ్ ను ప్యాక్ చేసిన ఆహారాల షెల్ లైష్ పెంచడానికి సమృద్ధిగా ఉపయోగిస్తారు.
ఈ యాసిడ్ పిండం మెదడులోని న్యూరాన్ల అభివృద్దిని ప్రభావితం చేస్తుంది. ఆటిస్టిక్ పిల్లల నుండి సేకరించిన మలం నమూనాలలో ఈ ఆమ్లం అధిక స్థాయిలో ఉందని, అలాగే వారి గట్ బ్యాక్టీరియా కూడా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధిక మొత్తంలో ఈ యాసిడ్ నాడీ మార్గాలను కూడా కుదించి దెబ్బతీస్తుందని తెలిసింది. తగ్గిన న్యూరాన్లు, బలహీనమైన నాడీ మార్గాల కలయిక వల్ల పిల్లల్లో ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ తినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో నచ్చిన ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేసి తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్ కు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని వేరే పద్దతిలో తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. పుట్టేబిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.