Pregnant Cars | న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రెగ్నెంట్ కార్లు..! అదేంటి.. కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? చైనాలో ఠారెత్తిస్తున్న ఎండలు అటు పౌరులనే కాదు, ఇటు కార్లను కూడా నానా ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. కార్ల రక్షణకు వేసిన ప్రొటెక్టివ్ ఫిల్మ్ అధిక వేడికి వ్యాకోచం చెంది కారుకు గర్భమొచ్చినట్టు బాయ్నెట్ ప్రాంతంలో పైకి ఎగదన్నుతున్నాయి.
ఆడీ లాంటి ఖరీదైన కార్లకు కూడా ఇది తప్పడం లేదు. గర్భం దాల్చినట్టు ఉన్న కార్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ కాగా, కొందరు వీటిని ‘ప్రెగ్నెంట్ కార్లు’గా వ్యవహరిస్తున్నారు. చైనా కార్లు కొంటున్నారా? వాతావరణం వేడిగా ఉంటే వాటికి గర్భమొస్తుంది జాగ్రత్త’ అని చైనా ఎక్స్పర్ట్ రిపోర్టర్ జెన్నీఫర్ జెంగ్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.