భారీ పానిండియా చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పుడు హీరోల గెటప్‌ని గోప్యంగా ఉంచడం సహజం. సమయం చూసుకొని మేకర్సే ఆ లుక్‌ని విడుదల చేస్తుంటారు. ఇదంతా ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ మేకర్స్ విడుదల చేయకముందే లొకేషన్లో దొంగతనంగా ఫొటోలు తీసి, వాటిని ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడం నిజంగా నేరమే. ‘ఫౌజీ’ సినిమా సెట్ నుంచి ప్రభాస్ ఫొటోలను ఇలాగే కొందరు తుంటరులు లీక్ చేశారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘మా సెట్ నుంచి లీకైన కొన్ని ఫొటోలను ఆన్లైన్ వేదికగా సర్క్యూలేట్ చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఓ వెండితెర అద్భుతాన్ని మీకందించేందుకు మేం అహరహం కృషి చేస్తున్నాం.
మీ ఎదురు చూపులకు తగిన ఫలితాన్నిస్తాం. కానీ ఈ విధమైన చర్యలు మా పనిపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పనులకు తెగబడుతున్నవారికి ఇదే మా హెచ్చరిక. ఈ అనధికార కంటెంట్‌పై ఫిర్యాదు చేస్తాం. తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం’ అని ‘ఫౌజీ’ చిత్రబృందం హెచ్చరించింది. 1940ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇమాన్వి కథానాయిక. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రధారులు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.