
సైదాబాద్, జనవరి 8: పై అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వేడి గంజి కిందకు పారబోయగా, అది ఓ పారిశుధ్య కార్మికుడిపై పడి.. గాయాలయ్యాయి. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ వాంబే క్వార్టర్స్‌లో బల్దియా కార్మికుడు రమేశ్ శనివారం ఉదయం పారిశుధ్య పనులు నిర్వహిస్తుండగా, ఎవరో వేడి గంజిని కిందకు పారబోయడంతో అతడు గాయపడ్డాడు.
తీవ్రంగా స్పందించిన తోటి కార్మికులు
రమేశ్ గాయపడిన ఘటనపై తోటి కార్మికులు తీవ్రంగా స్పందించారు. ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎవరికి వారు తమకు తెలియదంటూ తప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంబే క్వార్టర్స్‌లో వ్యర్థాలను తొలగించాలని ఒకవైపు ఫిర్యాదు చేస్తూనే.. ఉద్దేశపూర్వకంగా కార్మికులపై వేడి గంజి పోయడం ఎంతవరకు సమంజసమని జీహెచ్ఎంసీ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ వేణు ప్రశ్నించారు. మూడు మాసాల కిందట కూడా ఇదే తరహాలో వేడి గంజి పోయడంతో ఓ కార్మికుడు గాయపడ్డాడని మళ్లీ అలాంటి ఘటనే జరుగడం బాధాకరమన్నారు. గాయపడ్డ పారిశుధ్య కార్మికుడికి సహచార కార్మికులు ప్రథమ చికిత్స చేశారు. ఈ విషయాన్ని సైదాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, విచారణ జరుపుతున్నారు.