హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. జూన్ రెండోవారంలోపు కొత్త మంత్రివర్గానికి తుదిరూపం వచ్చే అవకాశం ఉన్నదని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రతిపాదనలను దూత ద్వారా ఢిల్లీకి పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను క్యాబినెట్ నుంచి తప్పించి స్పీకర్‌గా పంపాలని, ఆయన స్థానంలో గడ్డం ప్రసాద్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చేసిన ప్రతిపాదనను ‘నమస్తే తెలంగాణ’ ముందే పసిగట్టి ‘డిప్యూటి సీఎం పదవికి కత్తెర’ అనే శీర్షికతో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్ఠానం కంట్లో పడేందుకు ఢిల్లీ వెళ్తున్నారు.
తమకు గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తు తం క్యాబినెట్లో రెండు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు రంగారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఈసారి కచ్చితంగా ఆ జిల్లాల నేతలకు చోటు కల్పించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక్కడే సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించారని, భట్టి విక్రమార్కను క్యాబినెట్ నుంచి తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌ను తీసుకోవాలని ప్రతిపాదించారని సమాచారం.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. రంగారెడ్డి జిల్లాలో రెడ్డి సా మాజికవర్గానికి స్థానం దక్కకుండా అడ్డుకోగలిగితే, దానిని నిజామాబాద్ జిల్లాలో తనకు అత్యంత సన్నిహితుడైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చేలా పావులు కదిపారని తెలిసింది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. దీంతో రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి, రాహుల్‌గాంధీని కలిసినట్టు తెలిసింది. తనకు పదవి దక్కకుండా సీఎం కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఇదే జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనకు అన్ని అర్హతలున్నాయని, తనకే అవకాశమివ్వాలని విన్నవించినట్టు సమాచారం. అదే దారిలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం ఇచ్చే నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేల పేరుతో చేసే సూచనలను పరిగణనలోకి తీసుకోవద్దని, పార్టీ కోసం పనిచేసిన నిబద్ధతను కొలమానంగా చూసి తమ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని వారు కోరినట్టు తెలిసింది.
ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉండగా, 14మంది పోటీ పడుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇందులో అర డజన్ మందికి పైగా రెడ్డి, ఇద్దరు ఎస్టీ, ఇద్దరు వెలమ, మరో ఇద్దరు బీసీ నాయకులు ఉన్నట్టు పేర్కొన్నాయి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, మిగిలిన రెండు బీసీ, ఎస్టీ నేతలకు చెరొకటి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. క్యాబినెట్లో మార్పులతోపాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. డోర్నకల్ ఎ మ్మెల్యే రామచంద్రు నాయక్‌కు నిరుడు జూన్ లో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రకటించగా, తిరస్కరించారు. మంత్రి పదవి కోసం పట్టుపడుతున్నారు. ప్రస్తుతం భంగపడబోయే నేతలకు క్యాబినెట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.