Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పరిస్థితుల్లో జీవిస్తున్నవారికి తీవ్రమైన ఎండలు, చలి సమయంలో మరణించే ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే పది రెట్లకు పైగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Poor People | దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పరిస్థితుల్లో జీవిస్తున్నవారికి తీవ్రమైన ఎండలు, చలి సమయంలో మరణించే ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే పది రెట్లకు పైగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. ఆరోగ్య సమస్యలు ఉండడంతోపాటు సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిలో తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల మరణాల ముప్పు గణనీయంగా పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడిగాలుల తీవ్రత, తరచుదనం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. తీవ్రమైన చలి సంఘటనలు కొంత తగ్గినప్పటికీ, చలి కూడా ప్రజారోగ్యానికి ముప్పుగానే కొనసాగుతోంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా సంభవించే మరణాల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మరింత ముప్పు..
సాధారణంగా మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకునేందుకు కొన్ని సహజ ప్రక్రియలను ఉపయోగిస్తుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పట్టడం, రక్తనాళాలు వ్యాకోచించడం ద్వారా శరీరంలోని వేడిని బయటకు పంపిస్తుంది. చలి సమయంలో రక్తనాళాలు కుచించుకుపోయి, శరీరం అదనపు వేడిని ఉత్పత్తి చేస్తుంది. అయితే గుండె, మూత్రపిండాలు, జీవక్రియకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ఈ ప్రక్రియలు సమర్థవంతంగా పనిచేయవు. దీనికి తోడు సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. సరైన గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ లేని ఇళ్లలో నివసించేవారు తీవ్రమైన ఎండలు లేదా చలి నుంచి తమను తాము కాపాడుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శీతలీకరణ, వేడి అందించే పరికరాలు అందుబాటులో లేకపోవడం కూడా శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది.
అధ్యయనంలో ఏం తేలింది..?
ఈ అధ్యయనం కోసం ఫిన్లాండ్కు చెందిన 2,75,763 మంది, బ్రిటన్‌కు చెందిన 9,681 మంది పెద్దల ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు సహా 17 రకాల దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులను వైద్యపరమైన ముప్పుగా పరిగణించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని వారు నివసించే ప్రాంతాల ఆధారంగా అంచనా వేశారు. వ్యక్తిగత ఆదాయం, ఇంటి పరిస్థితులు లేదా వేడి, చల్లదనాన్ని నియంత్రించే సదుపాయాలను నేరుగా పరిశీలించలేదు. ప్రతి ప్రాంతంలో ఏడు రోజుల సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా లేదా అత్యల్పంగా నమోదైన 2.5 శాతం కాలాలను తీవ్రమైన ఉష్ణోగ్రతలుగా పరిగణించారు. ఫిన్లాండ్లో ఏడు రోజుల సగటు ఉష్ణోగ్రత 20.4 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే మరణాల రేటు 1.4 రెట్లు ఎక్కువగా నమోదైంది. మైనస్ 11.4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో మరణాల రేటు 1.1 రెట్లు పెరిగినట్లు కనిపించినప్పటికీ, ఈ పెరుగుదల గణాంకపరంగా నిర్ధారణ కాలేదు. బ్రిటన్‌లోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే కనిపించాయి. రెండు రకాల ముప్పులు ఉన్నవారిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలతో సంబంధం ఉన్న అదనపు మరణాల ప్రమాదం పది రెట్లకు పైగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
భూతాపం మరింత పెరిగితే మరణాల ముప్పు అధికం..
భవిష్యత్తులో భూతాపం ఒక డిగ్రీ నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగితే, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా సంభవించే మరణాల శాతం సుమారు ఒక శాతం నుంచి ఐదు శాతానికి పైగా పెరుగుతుందని వాతావరణ నమూనాల అంచనాలు సూచించాయి. ఫిన్లాండ్లో చలి సమయంలో అత్యవసర ఆసుపత్రి సందర్శనలు తొమ్మిది శాతం తగ్గగా, తీవ్రమైన వేడి సమయంలో ఐదు శాతం పెరిగాయి. అయితే చలి సమయంలో ఆసుపత్రికి వెళ్లేవారి సంఖ్య తగ్గిందంటే ఆరోగ్య సమస్యలు తగ్గినట్లు కాదు. వాతావరణ పరిస్థితుల వల్ల ప్రయాణం చేయలేకపోవడం కూడా దీనికి కారణం అవుతుంది. ఈ పరిశోధన ఫిన్లాండ్, బ్రిటన్‌లోని కొన్ని వర్గాల సమాచారంపైనే ఆధారపడింది. కాబట్టి ఫలితాలను అన్ని దేశాలకు వర్తింపజేయలేమని పరిశోధకులు స్పష్టం చేశారు. పైగా ఇది పరిశీలనాత్మక అధ్యయనం కావడంతో తీవ్రమైన ఉష్ణోగ్రతలే నేరుగా మరణాలకు కారణమయ్యాయని నిర్ధారించలేదు. అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ప్రత్యేక రక్షణ చర్యలు అవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇళ్లలో సరైన గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ సదుపాయాలు కల్పించడం, వైద్య సేవలను అందుబాటులో ఉంచడం, వేడిగాలులు, చలి సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
KTR | కేసీఆర్ ఇదే నిర్మల్ గడ్డ మీద తెలంగాణను తీసుకొస్తా అన్నరు : కేటీఆర్
రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

