Pooja Hegde | తమిళ సినీ రంగంలో అగ్రహీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రెండేళ్ల క్రితం స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల్లో భారీ స్పందన కనిపించింది. ముఖ్యంగా ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం, ఘన విజయం సాధించడం విశేషం. ఈ విజయంతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆయన ఎదుగుదల విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రాజకీయ విజయానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్ పూజా హెగ్డే ముందే విజయ్ గెలుస్తారని చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి నటించిన జన నాయగన్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఈ వీడియోలో, “ఎవరు గెలుస్తారు?” అనే ప్రశ్నకు పూజా సరదాగా విజయ్ వైపు చూపిస్తూ “ఈయనే గెలుస్తారు” అని చెబుతారు. అప్పుడు విజయ్ చిరునవ్వుతో స్పందించారు. ఇప్పుడు ఆయన నిజంగానే విజయం సాధించడంతో, “విజయ్ సార్ సీఎం అవుతారని నేను ముందే ఊహించాను. మీ కలలు నిజం కావాలి” అంటూ పూజా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. విజయ్ విజయం తర్వాత అభిమానులు మరో ఆసక్తికర విషయాన్ని బయటకు తీసుకువచ్చారు. ఆయన నటించిన GOAT సినిమాలో కనిపించిన కారు నెంబర్ “TN 07 CM 2026” ఇప్పుడు చర్చనీయాంశమైంది.
“CM 2026” అనే నెంబర్ అప్పట్లోనే ఆయన భవిష్యత్తును సూచించిందా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యాదృచ్ఛికంగా వచ్చిన ఈ నెంబర్ ఇప్పుడు నిజమవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చివరి చిత్రంగా జన నాయగన్ విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటంతో అభిమానులు గర్వపడుతున్నప్పటికీ, ఇకపై ఆయనను వెండితెరపై చూడలేమనే బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ‘దళపతి’గా ప్రేక్షకులను అలరించిన విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నిజమైన ‘జన నాయగన్’గా ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx
— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026