హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో రిటైరైన కార్మికులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం నిజమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అంగీకరించారు. వారికి డబ్బులు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ 1,000 రోజుల పాలనలో ఆర్టీసీ, రవాణా శాఖల అభివృద్ధిపై మంగళవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన కొన్ని భూములను తీసుకోవడాన్ని మంత్రి పొన్నం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలోని పేదలకు మేము ఇండ్లు కట్టొద్దా? ప్రభుత్వం నుంచి ఆర్టీసీ వందల ఎకరాలను తీసుకుంటున్నప్పుడు 5, 10 ఎకరాలు అడిగితే ఇవ్వొద్దా? ఇందులోతప్పేమున్నది?’ అని ప్రశ్నించారు.
‘మహాలక్ష్మి’ పథకం అమల్లో భాగంగా ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.12,167 కోట్లలో ఇప్పటికే రూ.10 వేల కోట్లు అందజేశామని తెలిపారు. ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారని, దీంతో చాలా సమస్యలు సమసిపోయాయని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సానుకూలంగానే ఉన్నామని, ఈ అంశంపై రివ్యూ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.