కరీంనగర్ ముకరంపుర, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ సర్కార్ జారీచేసిన జీవో 97పై ఆందోళనల మంటలు ఆరకముందే మరో పిడుగు పడుతున్నది. ఇప్పటికే డిప్లొమా (ఈఈఈ) పూర్తిచేసి సబ్ఇంజినీర్గా విద్యుత్తు శాఖలో కొలువు సాధించేందుకు నిరీక్షిస్తున్న వేల మంది యువకులకు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) కన్వర్షన్ రూపంలో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
గుట్టుచప్పుడు కాకుండా జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) టూ సబ్ ఇంజినీర్ కన్వర్షన్ పేరుతో పెద్ద మొత్తంలో సబ్‌ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీంతో భవిష్యత్తులో కొన్నేండ్ల దాకా సబ్‌ఇంజినీర్ల పోస్టులకు నేరుగా నియామకాలు జరిగే అవకాశం ఉండదు. దీనివెనుక పెద్దతతంగమే నడుస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ విధించిన నిబంధనలతోపాటు ఏకంగా పరీక్ష విధానంలో తమకు నచ్చిన విధంగా మార్పులు చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ, ఉస్మానియా వంటి శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయాలను కాదని సొంతంగా పరీక్షలు నిర్వహిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది.
అసలు కన్వర్షన్ కథ ఏందంటే
విద్యుత్తు సంస్థల్లో కిందిస్థాయిలో జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) పోస్టు కీలకమైంది. వీరంతా ఆపరేషన్, మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగంలో పనిచేస్తుంటారు. జేఎల్ఎంగా పనిచేస్తూ డిప్లొమా(ఈఈఈ) సర్టిఫికెట్ ఉన్న వారిని కొన్ని నిబంధనలకు లోబడి సంస్థ సబ్ఇంజినీర్గా కన్వర్షన్ పొందేందుకు వీలు కల్పించింది. ఈ పోస్టు ఇంజినీరింగ్ (ప్రొవెన్షియల్) క్యాడర్‌కు చెందినది కావడంతో క్రేజ్ ఏర్పడింది. వాస్తవానికి ఏ శాఖలోనైనా ఖాళీల ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తోపాటు అప్పటికే సర్వీసులో ఉన్న వారికి ఉద్యోగోన్నతులు కల్పించేందుకు నిర్దేశిత రేషియో విధానాన్ని అనుసరిస్తుంటారు.
కానీ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థలో కన్వర్షన్ విధానానికి సంబంధించి రేషియో విషయంలో స్పష్టత లేదని విద్యుత్తురంగ నిపుణులు అంటున్నారు. దీంతో ఎన్ని పోస్టులు డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ చేయాలి, ఎన్ని పోస్టులను కన్వర్షన్ రూపంలో భర్తీ చేయాలనేది సంస్థ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం టూ సబ్‌ఇంజినీర్ కన్వర్షన్ ఇష్టారాజ్యంగా జరుగుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలుకుబడి, రాజకీయ అండదండలతో సంస్థలోని కొంతమంది వ్యక్తులు తెరచాటుగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విద్యుత్తుశాఖలో పనిచేసే కార్మిక నేత ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతుండగా, సంబంధిత శాఖ పెద్దల కనుసన్నల్లోనే దందా జరుగుతుందనేది విద్యుత్తు సంస్థల్లో జగమెరిగిన సత్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేనట్లేనా?
ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో 150-200 వరకు సబ్ ఇంజినీర్ల పోస్టులను జేఎల్‌ఎంలతో కన్వర్షన్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇందుకోసం దాదాపు 250 మందితో జాబితా సిద్ధం చేశారు. వీరికి స్క్రీనింగ్ నిర్వహించి కన్వర్షన్ ద్వారా పోస్టింగ్‌లు ఇస్తే ఇక ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో సబ్‌ఇంజినీర్ పోస్టులు ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు అరుదు అని నిపుణులు పేర్కొంటున్నారు. డైరెక్ట్ సబ్‌ఇంజినీర్ రిక్రూట్మెంట్ కోసం డిప్లొమా(ఈఈఈ) పూర్తిచేసి ఏండ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఇదో పెద్ద షాక్. దీంతో కరెంటు ఆఫీసుల్లో సబ్‌ఇంజినీర్ కొలువు కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల ఆశలు కలగానే మిగులనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.