బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సందర్భానికి అనుగుణంగా రకరకాల ఆభరణాలు అలంకరించుకోవాలనే అతివల ఆశ ఆశగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక మహిళలు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల జోలికి పోకుండా అందంగా, ఆకర్షణగా ఉండే ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల ఫ్యాబ్రిక్, పేపర్, థ్రెడ్, ఎనామెల్, వ్యాక్స్.. ఇలా రకరకాల ఆభరణాలు నేటి మహిళల అలంకరణలో ఒదిగిపోతున్నాయి. సోషల్ మీడియా సహాయంతో చాలామంది స్వయంగా చేసుకోవడం, చేసి తమ పేజీల ద్వారా ప్రమోషన్ చేసుకుంటూ అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ తరాన్ని మెప్పిస్తున్న మరో రకం ఆభరణాలు పాలిమర్ జువెల్లరీ. తక్కువ ధరలో కావాల్సిన రంగులో అందుబాటులో ఉండే పాలిమర్ ఆభరణాల విశేషాలేంటో తెలుసుకుందాం..
పాలిమర్ ఆభరణాలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. బంగారం, వెండి ఆభరణాలకు భిన్నంగా పాలిమర్ ఆభరణాలు లభిస్తుండటం, కావాల్సిన రంగుల్లో ఎంచుకునే వీలుండటంతో వీటికి విశేష ఆదరణ దక్కుతున్నది. పాలిమర్ క్లే అనేది పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిసైజర్లతో తయారైన ఒక సౌకర్యవంతమైన, రంగురంగుల మృత్తిక. ఇది సాధారణ మట్టిలా కాకుండా, ఓవెన్లో తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా గట్టిగా, ఆభరణాల తయారీకి అనువైన పదార్థంగా మారుతుంది. ఇది పర్యావరణ హితమైనది. ఈ క్లే అనేక రంగులలో లభిస్తుంది, దీనిని సులభంగా నచ్చిన ఆకారంలోకి మార్చుకోవచ్చు. సంక్లిష్టమైన పూల ఆకారాల నుంచి ఆధునిక జ్యామితీయ డిజైన్ల వరకు అభిరుచికి తగినట్లు మలుచుకోవచ్చు. సంప్రదాయ ఆభరణాలతో పోలిస్తే, పాలిమర్ ఆభరణాలు చాలా తేలికగా ఉంటాయి, అంతేకాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. అభిరుచికి తగినట్లు రకరకాల డిజైన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఈ పాలిమర్ క్లేతో చేసిన చెవిరింగులు, హారాలు, బ్రాస్లెట్లు, కంఠాభరణాలు, నెక్లెస్‌లు, గాజులు, పట్టీలు.. ఇలా ప్రతి ఆభరణం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆధునిక ట్రెండ్‌కి సరిపోయేలా స్టయిలిష్ లుక్ కోసం రకరకాల త్రిభుజాలు, షడ్భుజులు, వృత్తాకారాల్లోనూ ఈ ఆభరణాలు లభిస్తున్నాయి. ట్రెండీవేర్పైనా ఇవి చక్కని ఎంపికగా నిలుస్తాయి. వీటికి మరింత ఆకర్షణ చేకూర్చేందుకు రెసిన్, ఎనామెల్, బీడ్స్, నియాన్ రంగులు వాడి గ్రేడియెంట్ ఎఫెక్ట్‌తో ఈ ఆభరణాలను తయారుచేస్తున్నారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా ఈ ఆభరణాలు రోజురోజుకు ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి. రసాయనాలతో కూడిన ఫెర్ఫ్యూమ్స్ వంటివాటికి దూరంగా ఉంచడం వల్ల ఈ పాలిమర్ క్లే ఆభరణాలను ఎక్కువ కాలం అలంకరించుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ అందమైన ఆభరణాలను మీరూ ఓసారి ట్రై చేయండి!