న్యూఢిల్లీ/అయోధ్య, డిసెంబర్ 23: అయోధ్యలో రామాలయం చుట్టూ నడుస్తున్న భారీ అక్రమ భూదందాను జాతీయ మీడియా బట్టబయలు చేసింది. శ్రీరాముడి జన్మభూమిగా హిందువులందరూ విశ్వసించే చోట కొత్త రామాలయం కట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన వెంటనే యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వారికి సన్నిహితులైన అధికారులు భారీగా భూములు కొన్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆంగ్ల దినపత్రిక ఆధారాలతోసహా బయటపెట్టింది.
దశాబ్దాల న్యాయ వివాదానికి తెరదించుతూ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దళితులు, పేదల భూములను అధికార పార్టీ నేతలు తక్కువ ధరలకే సొంతం చేసుకొన్నారు. కొందరు సొంతంగానే దర్జాగా భూములు కొనగా, మరికొందరు బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. రామాలయం పునర్నిర్మాణం తర్వాత భూముల ధరలకు రెక్కలొస్తాయని ముందుగానే అంచనావేసి భూ దందాకు తెరలేపారు. ఈ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని మీడియా పరిశోధనలో తేలింది. అయోధ్యలోని మహర్షి రామాయణ విద్యాపీఠ్ ట్రస్ట్ (ఎంఆర్వీటీ) ఈ కుంభకోణంలో కేంద్రంగా మారింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఈ భూ దందాలో ఎవరెవరు ఉన్నారంటే..
ఎంపీ అగర్వాల్
ఈయన 2019 నవంబర్ నుంచి అయోధ్య డివిజనల్ కమిషనర్‌గా ఉన్నారు. ఈయన మామ కేశవ్‌ప్రసాద్ అగర్వాల్ బర్హత మంజా ప్రాంతంలో 2020 డిసెంబర్ 10న ఎంఆర్వీటీ నుంచి రూ.31 లక్షలకు 2,530 చదరపు మీటర్ల భూమి కొన్నారు. ఆయన బావమరిది ఆనంద్‌వర్ధన్ అదే ట్రస్టు నుంచి రూ.15.50 లక్షలకు 1,260 చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేశారు.
పురుషోత్తమ్ దాస్ గుప్తా
ఈయన 2018 జూలై 20 నుంచి 2021 సెప్టెంబర్ 10 వరకు అయోధ్య చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈయన బావమరిది అతుల్ గుప్తా భార్య తృప్తి గుప్తా ఎంఆర్వీటీ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 12న రూ.21.88 లక్షలకు 1,230 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. దీనిపై పురుషోత్తమ్ స్పందించకపోయినా అతుల్ గుప్తా మాత్రం తక్కువ ధరకే భూమి వస్తున్నందు వల్లే కొన్నామని చెప్పారు.
ఇంద్రప్రతాప్ తివారీ
ఈయన అయోధ్య జిల్లా గోసాయ్‌గంజ్ ఎమ్మెల్యే. ఈయన కూడా ఎంఆర్వీటీ నుంచే బర్హత మంజా ప్రాంతంలో 2019 నవంబర్ 18న రూ.30 లక్షలు పెట్టి 2,593 చదరపు మీటర్ల భూమి కొన్నారు. ఈ ఏడాది మార్చి 16న ఇంద్రప్రతాప్ బావమరిది రాజేశ్‌కుమార్ మిశ్రా కూడా అదే ప్రాంతంలో రూ.47.40 లక్షలకు 6,320 చదరపు మీటర్ల భూమి కొన్నారు.
దీపక్‌కుమార్
ఈయన డిఫ్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా అయోధ్య ప్రాంతంలో 2020 జూలై 26 నుంచి ఈ ఏడాది మార్చి 30 వరకు పనిచేశారు. దీపక్ తన భార్య సోదరి మహిమా ఠాకూర్ పేరిట ఎంఆర్వీటీ నుంచి బర్హత మంజా ప్రాంతంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 1న రూ.19.75 లక్షలకు 1,020 చదరపు మీటర్ల భూమి కొన్నారు.
ఉమాధర్ ద్వివేదీ
ఈయన విశ్రాంత ఐఏఎస్. ఎంఆర్వీటీ ట్రస్టు నుంచే బర్హత మంజా ప్రాంతంలోనే రూ.39.04 లక్షలతో 1,680 చదరపు మీటర్ల భూమి కొన్నారు.
వేద్‌ప్రకాశ్ గుప్తా
ఈయన అయోధ్య ఎమ్మెల్యే. బర్హత మంజా ప్రాంతంలో ఈయన మేనల్లుడు.. తరుణ్మిట్టల్ రేణుసింగ్, సీమాసోని అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 2019 నవంబర్ 21న రూ.1.15 కోట్లతో 5,174 చదరపు మీటర్ల భూమి కొన్నారు. 2020 డిసెంబర్ 29న రామాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో రూ.4 కోట్లతో 14,860 చదరపు మీటర్ల భూమి కొన్నారు.
రిషికేశ్ ఉపాధ్యాయ్
ఈయన అయోధ్య మేయర్. బీజేపీ నేత. 2019 సెప్టెంబర్ 18న రూ.30 లక్షలతో ఆలయ సమీపంలో 1,480 చదరపు మీటర్ల భూమి కొన్నారు. అంతకుముందు 2018 జూలై 9న పరమహంస శిక్ష ప్రశిక్ష మహావిద్యాలయ్ మేనేజర్ హోదాలో అయోధ్యలోని కాజీపూర్ చితవాన్లో రమేశ్ అనే వ్యక్తి నుంచి 2,530 చదరపు మీటర్లు డొనేషన్‌గా స్వీకరించారు. ఆయుష్ చతుర్వేది అనే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ప్రొవిన్షియల్ పొలీస్ సర్వీస్ ఆఫీసర్‌గా పనిచేసిన అరవింద్ చౌరాసియా, రాష్ట్ర సమాచార కమిషనర్ హర్షవర్దన్ షాహీ, రాష్ట్ర ఓబీసీ కమిషన్ సభ్యుడు బల్రామ్ మౌర్య కూడా రూ. లక్షల విలువచేసే భూములను కొన్నారు. ఈ భూబాగోతం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనిపై విపక్షాలు మండిపడటంతో యూపీ సర్కారు దర్యాప్తునకు ఆదేశించింది.