న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశంలో మరోసారి మూడో ఫ్రంట్ పేరు వెలుగులోకి వచ్చింది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ను పక్కన పెట్టి తమిళనాడులోని డీఎంకే ప్రయత్నాలు చేస్తున్నదా అన్న అనుమానాలు ఇటీవలి రాజకీయ పరిణామాలు చూస్తే కలుగుతున్నాయి. డీఎంకే నేత కనిమొళి.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఇప్పటికే కలవడం, ఆమె కోల్‌కతా వెళ్లి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీని కలుసుకుంటారన్న ఊహాగానాలు దీనికి ఊతమిస్తున్నాయి.
బీజేపీని ఎదుర్కోడానికి డీఎంకే సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. గత కొన్ని వారాలుగా డీఎంకే ఎంపీ కనిమొళి పలువురు ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే ఆమె ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌పవార్, ఆమె కు మార్తె, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలేతో సమావేశమయ్యారు. తదుపరి ఆమె మమతా బెనర్జీని కలుస్తారని ప్రచారం జరుగుతున్నది.