సిటీబ్యూరో, మార్చ్17(నమస్తే తెలంగాణ): ఢిల్లీ , గోవా ప్రాంతాల నుంచి ఎయిర్‌లైన్స్, రైలు ద్వారా అక్రమంగా తెలంగాణలోకి వస్తున్న 239 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను రెండు కేసుల్లో ఎస్టీఎఫ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా మద్యం వస్తుందని సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ సిబ్బంది పహాడీషరీఫ్ వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 213 నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.4.26లక్షలు ఉంటుందని అంచనావేశారు. ఈ మద్యం బాటిళ్లను మారేడ్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
మరో కేసులో ఎస్టీఎఫ్డీ టీమ్ సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 10పై ఢిల్లీ నుంచి వచ్చిన 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భగవాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మారేడ్‌పల్లి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ అప్పగించగా పట్టుకున్న మద్యం విలువ రూ.52వేలుగా ఉంటుందని అంచనావేశారు.