బంజారాహిల్స్, డిసెంబర్ 18: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరాలం మండిలోని మీర్‌చౌక్‌కు చెందిన వ్యాపారి అతీక్ బిన్ యూసుఫ్(35), తన స్నేహితులైన ఫూల్‌బాగ్‌కు చెందిన వ్యాపారి సయ్యద్ బిలాలుద్దీన్ అలియాస్ ఫర్హాన్(32), ఖాజిపూరకు చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ ఆరిఫ్(28)తో కలిసి ఈనెల 15న సాయంత్రం ఇంట్లోంచి బయలుదేరారు. జియాగూడలోని ఓ బార్లో పీకలదాకా మద్యం సేవించిన ముగ్గురూ సరదాగా షికారు కొట్టాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఐ-20 కారులో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు వైపునకు వెళ్తున్నారు. అతిక్ బిన్ యూసుఫ్ కారు నడిపిస్తుండగా, మిగిలిన వారు పక్కన కూర్చున్నారు.
అతివేగంతో వెళ్తున్న వీరి కారు.. ఆల్మండ్ హౌజ్ వద్దకు రాగానే అదుపు తప్పి..డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు గాల్లోకి ఎగిరి రోడ్డుకు అవతల ఎదురుగా వస్తున్న మరో వాహనంపై పడింది. అందులో ప్రయాణిస్తున్న హైటెక్‌సిటీ ప్రాంతంలోని గ్లోబల్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ వాహనం డ్రైవర్ గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని.. ప్రశ్నించగా, మద్యం సేవించిన సంగతి బయపడింది. నిందితులపై కేసు నమోదు చేసి..శనివారం రిమాండ్‌కు తరలించారు.