సిరిసిల్ల తెలంగాణ చౌక్, మే 26 : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై శనివారం రాత్రి ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బృందాలుగా ఏర్పడి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ క్రమంలో తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన మహమ్మద్ మహబూబ్, రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బొండు అంజయ్య, గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ఓరగంటి లక్ష్మణ్‌ను నకిలీ ఏజెంట్లుగా గుర్తించి కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 43 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 19 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయినా, డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నా.. పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విదేశాల్లో ఉదోగ్యాలు, ఉపాధి కోసం వెళ్లే వారికి నకిలీ వీసాలు ఇచ్చి మోసాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్ల ద్వారానే వీసాలు పొందాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలసుకునేందుకు పోలీస్‌శాఖను సంప్రదించాలని కోరారు.