పోలీస్ బాస్‌లు మారగానే.. వారి వెంటనే శిశ్యులు వెళ్తూ.. సారూ.. నేను ఇక్కడికి వచ్చేస్తానంటూ అభ్యర్ధన చేస్తున్నారు.. సరే మనవాడివే కదా వచ్చేద్దువులే అంటూ హామిలిస్తున్నారు.. దీంతో కొందరు సీఐలు అవసరమైతే జోన్లు మార్చుకుంటూ కమిషనరేట్లు జంప్ అవుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ప్యూచర్‌సిటీ నాలుగు కమిషనరేట్లలో కొందరు పోలీసు అధికారులకు మంచి పోస్టింగ్‌ల కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటారు.. అప్పటి వరకు ఉన్న బాస్‌ల వద్ద మార్కులు కొట్టేశారంటే.. ఇక ఆ బాస్ ఎక్కడున్నా..తమ పోస్టుకు ఢోకా ఉండదనే భావనలో కొందరు అధికారులు ఉంటున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) ;హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా, ఆర్టీసీ ఎండీగా పనిచేశారు, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, అంతకు ముందు హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీగా పనిచేశారు. ప్యూచర్ సిటీ కమిషనర్ గతంలో రాచకొండ కమిషనర్‌గా పనిచేశారు. ఆయా కమిషనర్లు గతంలో పనిచేసిన సమయంలో కొందరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు తమ పనుల్లో ఉత్సాహం చూపించడం, దర్యాప్తులో ప్రతిభ, వినయం విధేయతలు ప్రదర్శించడంతో ఆయా పోలీస్ కమిషనర్లలో నమ్మకస్తులుగా ముద్ర పడింది. దీంతో పోలీస్ బాసులు ఎక్కడకు వెళ్లినా అలాంటి వారు వారి వెంటనే వెళ్తున్నారు.
గతంలో హైదరాబాద్ సీసీఎస్‌లో పనిచేసిన వాళ్లు సైబరాబాద్‌కు వెళ్లిన వారు ఉన్నారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. తిరిగి అక్కడ పనిచేసిన అధికారులు ఇప్పుడు మల్కాజిగిరికి వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉండగా, రాచకొండలో గతంలో పనిచేసిన వాళ్లు ప్యూచర్ సిటీకి వెళ్తున్నారు. గతంలో సైబరాబాద్‌లో పనిచేసిన వాళ్లు హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు. ఇలా కమిషనర్ బాస్‌లను కలిసి తాము మీ వద్ద పనిచేస్తాం సారు అంటూ అభ్యర్థిస్తున్నట్లు పోలీస్ శాఖలో చర్చించుకుంటున్నారు.
మిగతా వాళ్లకు పోస్టింగ్లొద్దా..
ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొందరికి ఎస్‌హెచ్‌ఓలుగా ఇతర పోలీస్ విభాగాల్లో పోస్టింగ్‌లు వస్తుండగా, మరికొందరికి లూప్లైన్లో పోస్టింగ్‌లు ఇస్తుంటారు. అందరికీ అన్ని విభాగాలపై పట్టుండాల్సిన అవసరముంటుందని కొందరు అధికారులు భావిస్తూ బదిలీల్లో పారదర్శకతను ప్రదర్శిస్తుంటారు. ఇక్కడే ఆయా బాస్‌ల శిశ్యులకు ప్రత్యేక కేటగిరిలో పోస్టింగ్‌లు వస్తుండడంతో అప్పటి వరకు లూప్‌లైన్లలో ఉంటూ పోస్టింగ్‌ల కోసం ఎదురు చూసే వారిలో కొందరికి అన్యాయం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ బాస్‌ల వద్ద ఒక్క సారి మార్కులు కొట్టారంటే ఇక వాళ్లు ఎక్కడున్నా.. ఆయా అధికారుల పోస్టింగ్‌లకు ఢోకా ఉండదని పలువురు అధికారులు మాట్లాడుకుంటున్నారు. పోలీస్ బాస్‌లు కూడా ఒకటి రెండు సార్లు చూసి… ఇలాంటి వాళ్లను పక్కన పెట్టేస్తున్నట్లు సమాచారం. ఒక కమిషనరేట్ కాకుంటే.. మరో కమిషనరేట్‌లో పోస్టింగ్‌లు తెచ్చుకునే అతి తెలివి తేటలు కొందరు సీఐలు ప్రదర్శిస్తున్నట్లు ఉన్నతాధికారులు సైతం గుర్తించి, అలాంటి వారిని పక్కన పెట్టేస్తున్నారని సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. బాస్‌లు అందరికీ పోస్టింగ్‌లలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.