Renu Agarwal Murder : కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్పెషల్ టీమ్ జార్ఖండ్‌కు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం నిందితులిద్దరిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ (50) దంపతులకు ఫతేనగర్‌లో స్టీల్ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతోంది. కుమారుడు శుభంతో కలిసి రేణు దంపతులు నివసిస్తున్నారు. స్వాన్ లేక్‌లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్‌కు చెందిన రోషన్ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు జార్ఖండ్‌లోని తన గ్రామానికే చెందిన హర్ష్‌ను కొన్ని రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు.
బుధవారం ఉదయం రేణు భర్త రాకేశ్, కొడుకు శుభం దుకాణానికి వెళ్లగా.. ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదింటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఏడు గంటల సమయంలో రాకేశ్ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించి, వెనుక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లిచూడగా హాల్లో రేణు కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు.
తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్ష్, రోషన్లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. రేణును నిందితులు తాళ్లతో బంధించి.. డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కూరగాయల కత్తులతో గొంతు కోసి, కుక్కర్‌తో తలపై గట్టిగా కొట్టి చంపారు.
ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందినకాడికి డబ్బు, నగలు సూట్‌కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరూ సూట్‌కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. వేరే దుస్తులు ధరించారు. ఇంటికి తాళం వేసి రాకేశ్ కుటుంబానికే చెందిన స్కూటీపై పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఇవాళ జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.