సూర్యాపేట టౌన్, జనవరి 02 : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదన్నారు. అనుమతులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై కేసులను నమోదు చేయబడతాయన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బాణాసంచా, డీజేలు ఉపయోగించవద్దన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలు అందరూ భాగస్వాములు కావాలని ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ నెల 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. తద్వారా రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. జన సమూహ ప్రాంతాల్లో రోడ్డు భద్రత పట్ల, డిఫెన్సివ్ డ్రైవింగ్, అరైవ్ – అలైవ్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 3 నుండి 20వ తేదీ వరకు సూర్యాపేట జిల్లా పరిధిలో జరిగే టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.